పేకాట.. మొదట సరదాగా మొదలవుతుంది. గెలుపు రుచి చూసిన కొద్దీ అత్యాశ పెరుగుతుంది. ఒక్కసారి గెలిచిన డబ్బు.. మళ్లీ ఆడాలనే ఆశను పెంచుతుంది. ఓడిన డబ్బును తిరిగి గెలుచుకోవాలనే ఆలోచన అప్పుల్లోకి నెడుతుంది. చివరకు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు మొత్తం పేకాటకు పోతుంది. అప్పులు పెరిగి ఆస్తులు అమ్ముకోవడం లేదా కుదవ పెట్టడం జరుగుతోంది. ఈ జూదపు ఉచ్చులో చిక్కుకున్న కుటుంబాలు చివరకు వీధిన పడుతున్నాయి. మరోవైపు ఇదే పేకాట నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది.
‘కాపలా’కు ఆరుగురు.. ఏర్పాట్లకు నలుగురు
● అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మకూరు మండలంలోని ఐదు ఎకరాల భూమిని పేకాట కోసం కుదువ పెట్టాడు. ఈయన సుమారు రూ.2 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.
● అనంతపురం రూరల్ ప్రాంతానికే చెందిన మరో వ్యక్తి పేకాట అప్పులు తీర్చేందుకు కోట్ల రూపాయల విలువైన స్థలాలను విక్రయించాడు.
● ఉరవకొండ మండలానికి చెందిన మరో వ్యక్తి సుమారు 13 ఎకరాల భూమిని కుదవ పెట్టాడు.
.... ఇలాంటి బాధితులు ఒకరు, ఇద్దరు కాదు.. అనంతపురం నగరం, ధర్మవరం, ఆత్మకూరు, రామగిరి తదితర ప్రాంతాలకు చెందిన పలువురు ఈ పేకాట ఉచ్చులో చిక్కుకున్నట్లు సమాచారం. వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి.
రాప్తాడు రూరల్: రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల పరిధిలో ఊరికి దూరంగా పేకాట కేంద్రాలు ఏర్పాటు చేసి రోజూ ‘ఆట’ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక విడత.. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి వరకు మరో విడత ఆట సాగుతోంది. ఒక రోజు ఆట రూ.15 లక్షల వరకు జరుగుతోంది. ఒక్కో కేంద్రంలో 30 మంది వరకు పాల్గొంటున్నారు. రాప్తాడు, అనంతపురం రూరల్, అనంతపురం నగరం, నార్పల, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, ఉరవకొండ తదితర ప్రాంతాల నుంచి జూదరులను తీసుకొస్తున్నారు.
కార్లల్లోనే రాకపోకలు
ఆటకు వచ్చే వారిని కార్లలో పేకాట కేంద్రం సమీపంలో దింపుతున్నారు. అనంతరం వాహనాలను తిరిగి అనంతపురం పంపించి.. ఆట ముగిసిన తర్వాత ఫోన్ చేస్తే మళ్లీ వచ్చి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దీంతో పేకాట కేంద్రాల ఆచూకీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రూ.100కు రూ.10 వడ్డీ!
పేకాటలో డబ్బులు అయిపోయినా.. ఆట ఆగకుండా రుణ సౌకర్యం అందుబాటులో ఉంచుతున్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని తపోవనానికి చెందిన ఓ వ్యక్తి ఆటగాళ్లకు అప్పులు ఇస్తున్నట్లు సమాచారం. రూ.100కు రోజుకు రూ.10 వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే రూ.10 వేల అప్పు తీసుకుంటే చేతికి రూ.9 వేలు ఇచ్చి, తిరిగి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం తీసుకున్న అప్పును అదే రోజు సాయంత్రం వడ్డీతో సహా చెల్లించాలి. ఆ వ్యక్తి ఇప్పటి వరకు ఆటగాళ్లకు భూములు, స్థలాలు, ఇళ్లను కుదువ పెట్టుకుని సుమారు రూ.50 లక్షలకు పైగా అప్పులిచ్చినట్లు సమాచారం.
ఊరి బయటే అడ్డాలు
రాప్తాడు మండలం బుక్కచెర్ల చెరువు సమీపంలో, అనంతపురం రూరల్ మండలం ముండబండపల్లి ఈరాలమ్మ మాన్లు, నరసనాయనికుంట నల్లగుట్ట, కురుగుంట నుంచి కట్టకిందపల్లికి వెళ్లే మార్గం, కామారుపల్లి నుంచి మదిగుబ్బ వెళ్లే మార్గం తదితర ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. ఊరికి దూరంగా, నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకోవడంతో పోలీసుల కంటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
‘మేజు’తో లక్షల్లో ఆదాయం?
పేకాట నిర్వాహకులకు ‘మేజు’ రూపంలో రోజుకు రూ.1.80 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు సమాచారం. కూలీల ఖర్చులు, ఇతర వ్యయాలు పోగా నిర్వాహకులు రోజుకు పెద్ద మొత్తంలో డబ్బు పంచుకుంటున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రోజుకు లక్షల రూపాయల ఆట జరుగుతున్నా.. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నది మాత్రం ఆటగాళ్ల కుటుంబాలేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు.
పేకాటతో బతుకు బుగ్గి..
రోజూ రూ.15 లక్షల ‘ఆట’
అప్పులు.. అధిక వడ్డీలు.. ఆస్తుల తాకట్టు
రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల్లో జోరుగా సాగుతున్న పేకాట
పేకాట కేంద్రాల వద్ద పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం పది మంది వరకు కూలీలను వినియోగిస్తున్నారు. వారిలో ఆరుగురు కాపలాగా ఉండి కొత్త వ్యక్తులు వచ్చినా, పోలీసులు వచ్చినా వెంటనే సమాచారం చేరవేస్తున్నారు. మరో నలుగురు పేకాటకు అవసరమైన ఏర్పాట్లు చూస్తున్నారు. పట్టలు పరచడం, పేకల కట్టలు అందించడం, తాగునీరు, స్నాక్స్ తదితరాలు సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కూలీకి ఒక్కో విడతకు రూ.1,500 చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. రెండు విడతలకు కలిపి రోజుకు రూ.3 వేల వరకు అందుతున్నట్లు తెలుస్తోంది.


