● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
కణేకల్లు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా ఏంటో చూపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు నిచ్చారు. కణేకల్లులోని షిర్డీసాయిబాబా కల్యాణ మంటపంలో శనివారం మధ్యాహ్నం కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డితో కలిసి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయవచ్చన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఐదేళ్లలో రూ.4.49 లక్షల కోట్లు డీబీటీ– నాన్‌డీబీటీ ద్వారా పేదలకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.3వేలు, 50 ఏళ్లకే పింఛన్, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలు అమలు చేయకుండా ఆయా వర్గాలను వంచించా రన్నారు. అలవిగానీ హామీలు ఇవ్వడం.. తర్వాత ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు సర్కారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొందన్నారు. కార్యక్రమంలో కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల కన్వీనర్లు పాటిల్ బ్రహ్మానందరెడ్డి, రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు గౌని ఉపేంద్రరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఉషారాణి, రాజ్‌కుమార్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మక్బూల్‌బాషా, పార్టీ జిల్లా కోశాధికారి పాటిల్ నాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మారెంపల్లి మారెన్న, కణేకల్లు టౌన్ కన్వీనర్ జీహెచ్‌కే సర్మస్, అనుబంధ సంఘాల నేతలు పైనేటి తిమ్మప్ప చౌదరి, హళ్లి నాగరాజు, ఆదిసద్గురు చంద్రశేఖర్‌రెడ్డి, యండ్రకాయల వన్నూరప్ప, ఆలూరు చిక్కణ్ణ, కోటిరెడ్డి, కెంగుంట రామిరెడ్డి, యర్రగుంట గోవర్ధన్‌రెడ్డి, మందాల క్రిష్ణారెడ్డి, పూలచెర్ల సురేష్ పాల్గొన్నారు.


