కలెక్టర్‌కు జెడ్పీ పగ్గాలు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు జెడ్పీ పగ్గాలు

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

జెడ్పీ, మండల పరిషత్‌లో ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం

అనంతపురం న్యూ టౌన్‌: జిల్లా పరిషత్‌, మండల పరిషత్తుల పాలక మండళ్ల పదవీకాలం ముగియనుండడంతో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శనివారం రెండు ప్రత్యేక జీవోలను విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు 128 మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండల ప్రజా పరిషత్తు ప్రత్యేక పరిపాలన అధికారులను నియమించనున్నారు. ఈ ప్రత్యేక అధికారులు కొత్తగా ఎన్నికయ్యే పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించే వరకు మండల ప్రజా పరిషత్‌ అధికారాలు, విధులను నిర్వహించాల్సి ఉంటుంది. మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు, మండల ప్రాదేశిక సభ్యుల పదవీకాలం ఈ నెల 23వ తేదీన ముగియనుంది. కొత్తగా ఎన్నికలు జరిగేంత వరకు మండల స్థాయిలో ప్రభుత్వ పాలన ఆగిపోకూడదని పంచాయతీరాజ్‌ చట్టం చెబుతోంది. ప్రభుత్వం ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉంటుంది. మండల ప్రత్యేక అధికారి బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగిస్తారా లేక కొత్తగా మరెవరినైనా నియమించాలా అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

24న ముగియనున్న పాలక పదవీకాలం

అనంతపురం జిల్లా పరిషత్‌ పాలక మండలి పదవీ కాలం ఈనెల 24వ తేదీన ముగియనున్నది. ఆ తర్వాత జెడ్పీ పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి మారనుంది. ఈ మేరకు కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీఓ 129ని విడుదల చేసింది. ఆరు నెలల పదవీ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతలోపుగా మండల ప్రజా పరిషత్‌, జిల్లా ప్రజా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా, ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్‌ పేపర్ల సామగ్రి, బ్యాలెట్‌ బాక్సుల కూర్పు తదితర ఎన్నికల వ్యవహారాలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అనువుగా జిల్లా, మండల స్థాయి అధికారులు తలమునకలై ఉన్నారు.

54 మంది బీఎల్‌ఓలకు షోకాజ్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ఫేజ్‌–2లో హియరింగ్‌ నోటీసులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకుండా పెండింగ్‌లో ఉంచిన 54 మంది బూత్‌ లెవల్‌ అధికారు(బీఎల్‌ఓ)లు, సూపర్‌వైజర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. 50 రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంతో అనంతపురం అర్బన్‌ ఓటరు నమోదు అధికారి, ఆర్డీఓ ప్రేమంత్‌ కుమార్‌ శనివారం నోటీసులు జారీ చేశారు. ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2 హియరింగ్‌ నోటీసుల ఆన్‌లైన్‌ ప్రక్రియలో అనంతపురం నియోజకవర్గం రాష్ట్రంలో అత్యధిక పెండింగ్‌ ఉన్న నియోజకవర్గాల్లో రెండో స్థానంలో, జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లను ఫోన్‌ ద్వారా సంప్రదించినా పనిలో ఆశించిన పురోగతి కనిపించకపోవడంతో షోకాజ్‌ జారీ చేశారు. నోటీసు అందుకున్న వారు రెండ్రోజుల్లోగా, అంటే ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆర్డీఓ కార్యాలయంలో సంజాయిషీ సమర్పించాలని ఆదేశించారు. అలాగే మిగిలిన పెండింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గడువులోగా సంజాయిషీ ఇవ్వకపోయినా, పెండింగ్‌ పనులను పూర్తి చేయకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు నివేదిక పంపుతామని ఆర్డీఓ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement