ఉరవకొండ: ఉరవకొండ శివారులోని లత్తవరం రోడ్డు వద్ద రైతు మాదినేని శ్రీనివాసులు ఇంట్లో బుధవారం రాత్రి చోరీకి గురైన రూ.45 లక్షల నగదు బ్యాగు శుక్రవారం బాధిత రైతు పొలంలో ప్రత్యక్షమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బ్యాగు తెరిచి చూడగా రూ.32 లక్షల నగదు కనిపించింది. ఈ బ్యాగు తాను ఇంట్లో భ్రదపరచినదేనని రైతు గుర్తించాడు. మిగతా రూ.13 లక్షలు ఏమయ్యాయో తెలియడం లేదు. అసలు బ్యాగును బాధితుడి పొలంలోనే ఎవరు పడేసి వెళ్లానేది అంతుచిక్కడం లేదు. ఇంటిదొంగల పనేనా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. త్వరలోనే నిజానిజాలు బయటపడనున్నాయి.
‘డైట్’ సరఫరాకు
టెండర్ల ఆహ్వానం
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిధిలోని డీసీహెచ్‌ఎస్ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో రోగులు, వైద్య సిబ్బందికి ఆహారం (డైట్) సరఫరా చేసేందుకు అనుభవం, ఆసక్తి ఉన్న వారి నుంచి టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈ మేరకు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ వెంకట్రావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హిందూపురంలోని 200 పడకలు ఉన్న జిల్లా ఆస్పత్రితో పాటు తాడిపత్రి, గుంతకల్లు, మడకశిర, కదిరి, ధర్మవరం, రాయదుర్గంలోని వంద పడకల ప్రాంతీయ వైద్యశాలలు, అనంతపురంలోని సీడీ ఆస్పత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, గుత్తి, పెనుకొండ ప్రాంతాల్లోని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలు, కొనకొండ్ల, శింగనమల, కణేకల్లు, పామిడి, సీకే పల్లి, తనకల్లు, కొత్తచెరువు, గోరంట్ల, నల్లమాడ, రొళ్లలోని 30 పడకల సీహెచ్‌సీలకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు జిల్లా ఆస్పత్రికి రూ.2 వేలు, ప్రాంతీయ వైద్య శాలలకు రూ.1,500, సీడీ ఆస్పత్రి, సీహెచ్‌సీలకు రూ.వెయ్యి చొప్పున డీడీ (డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, అనంతపురం) తీసి ఈ నెల 21 నుంచి 26వ తేదీలోపు కార్యాలయం పనివేళల్లో అందజేయాలి. పూర్తి వివరాలకు 80085 53730, 82475 78680 నంబర్లలో సంప్రదించవచ్చు.
ఐటీఐల్లో ప్రవేశాలకు
గడువు పొడిగింపు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో (2026–27 విద్యా సంవత్సరానికి) మిగిలిన సీట్ల భర్తీకి నిర్వహించే 6వ విడత ప్రవేశాల కౌన్సెలింగ్ గడువును పొడిగించినట్లు ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ రాయపరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 91005 98631, 97032 31501 నంబర్లలో సంప్రదించాలన్నారు.
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
అనంతపురం అర్బన్: వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 నంబంరు నుంచి ఇప్పటి వరకు 24 శాఖలకు సంబంధించి మంజూరు చేసిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు లేనిపక్షంలో నిధులు వెనక్కు వెళతాయన్నారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన పనులు చేయకపోతే అభివృద్ధిలో జిల్లా వెనకబడుతుందన్నారు. పనుల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
రాష్ట్రస్థాయికి ఇద్దరు విద్యార్థినులు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా సైన్స్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన నేషనల్ సైన్స్ సెమినార్–2026 జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ‘భారతదేశ ఇంధన సమ్మేళనం–2047: అవకాశాలు– సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో గుంతకల్లు డాక్టర్ ఎస్‌ఆర్‌కేఎం ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని పి.నందిత, రాయదుర్గం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ఎస్.హఫీపా సాధియా ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరు రాష్ట్రస్థాయి పోటీల్లో అనంతపురం జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిని డీఈఓ డాక్టర్ అయూబ్ హుస్సేన్, జిల్లా సైన్స్ అధికారి నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.


