కరువు చిత్రం.. కన్నీటి కష్టం | - | Sakshi
Sakshi News home page

కరువు చిత్రం.. కన్నీటి కష్టం

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

శింగనమల/గుత్తి రూరల్‌: ఆరుతడి పంటలపై ఆశలేదు.. పచ్చని పంట పొలాలున్నా ఫలితంలేదు.. పంట పొలాలు బీటలు వారాయి.. పచ్చని పైర్లు నిలువునా నెర్రెలు చీలాయి.. వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన పంటలు కళ్లెదుటే నిలువునా ఎండిపోతుంటే.. కనుచూపు మేర ఎడారి ఛాయలు కనిపిస్తుంటే.. చూడలేక.. ఉండలేక ఆరుగాలం కష్టించే అన్నదాత దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.. ఇంతటి దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నా.. కనీసం వ్యవసాయానికి సాగునీరు అందలేదు.. సాయం అందించలేదు.. రైతు సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం.. రైతుల గురించి ఆలోచన కూడా చేయలేదని నిట్టూరుస్తున్నారు.

శింగనమల నియోజకవర్గం ఉద్యానతోటలకు ప్రసిద్ధి. కానీ నేడు భూగర్భజలం అడుగంటిపోవడంతో రైతులు దిక్కు తోచక విలవిల్లాడుతున్నారు. శింగనమల మండలం నాగులగుడ్డం తండాలో రైతు రాముడు నాయక్‌కు ఎనిమిదెకరాల పొలం ఉంది. చీనీపంటలు, ఇతర పంటల సాగుకోసం ఎనిమిది బోరుబావులు తవ్వాడు. నాలుగు బోర్లలో నీరు వస్తుండేది. కానీ అందులో రెండు బోర్లలో భూగర్భజలాలు అడుగంటాయి. మరో రెండు బోర్లలో మాత్రమే నీరు వచ్చేది. దీంతో పంటలకు నీరుచాలకపోవడంతో చుట్టుపక్కల ఉన్న రైతుల బోరుబావుల నుంచి ట్యాంకర్ల ద్వారా తెప్పించుకొని చీనీచెట్లను బతికించుకోవడానికి అష్టకష్టాలు పడ్డాడు. అయితే ట్యాంకర్లకు కూడా నీరు సరిపడా అందక దిక్కుతోచని స్థితిలో చీనీచెట్లను వదిలేయాల్సి వచ్చింది. గ్రామంలోని రైతులు కూడా తాగు, సాగు నీటి కోసం ఇక్కట్లు పడుతూనే ఉన్నారు.

నాగులగుడ్డం తండాలో రైతు మూడ్‌ రాముడు నాయక్‌ తోటలో ఎండిపోయిన చీనీ చెట్లు, శ్రీపురంలో వేరుశనగ పంటను దున్నేస్తున్న రైతు

శ్రీపురం వద్ద ఎండిన వేరుశనగ పంట..

గుత్తి మండలంలోని శ్రీపురంలో గోవిందు అనే రైతు ఖరీఫ్‌ సీజన్‌లో ఎంతో ఆశతో ఈ ఏడాదైనా దిగుబడి వస్తుందని మూడున్నర ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాడు. విత్తనం వేసినప్పటి నుంచి సరైన వర్షాలు లేవు. పంట ఎండుముఖం పట్టింది. ఇక వర్షం రాదు.. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆదుకోదని భావించాడు. దిక్కుతోచని స్థితిలో పశువుల మేత అయినా దక్కుతుందేమోనని భావించి వేరుశనగ పంటను శుక్రవారం దున్నేశాడు. ప్రస్తుతం మార్కెట్లో ట్రాక్టర్‌ వరిగడ్డి రూ.25 వేలు పలుకుతోంది. దీంతో రైతులు అంత ధరపెట్టి కొనుగోలు చేసే శక్తి లేక నష్టం అని తెలిసినా కూడా తమ పొలాల్లో వేరశనగ పంటలు తొలగించి పశువుల మేత కోసం ఇళ్లకు తరలిస్తున్నారు. దాదాపు రూ.60 వేలు వెచ్చించి వేరుశనగ సాగు చేశానని, పంట చేతికి రాక పూర్తిగా నట్టేట మునిగానని, రైతు గోవిందు ఆవేదన చెందాడు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కాదు.. ఎల్లోనినో ఎఫెక్ట్‌గానే రైతులు భావిస్తున్నారు.

ఎండిపోయిన 1200 చీనీ చెట్లు

నాగులగుడ్డం తండా వద్ద రైతు రాముడు నాయక్‌ వదిలేసిన చీనీ పంట

గుత్తి మండలం శ్రీపురం వద్ద వేరుశనగ పంటను దున్నేసిన రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement