దగ్గుపాటి.. వివాదాల కుంపటి | - | Sakshi
Sakshi News home page

దగ్గుపాటి.. వివాదాల కుంపటి

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. వివాదాలతో తరచూ వార్తల్లో కెక్కుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్న వారితో పాటు గతంలో ఎమ్మెల్యే వెన్నంటి నడిచిన వారే ఆయన తీరును తూర్పారపడుతున్నారు. ఎమ్మెల్యేకు డబ్బులుంటే చాలని.. మరెవ్వరూ అవసరం లేదని కార్యకర్తలే చెప్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకున్నా.. లేదా చెప్పిన పని చేయకున్నా కార్యకర్తలను వేధిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా ఎమ్మెల్యే ఏమాత్రమూ తగ్గడం లేదు.

సొంతపార్టీ కేడర్‌పైనే కేసులు

రుద్రంపేట గ్రామ పంచాయతీ పరిధిలో టీడీపీ సీనియర్‌ కార్యకర్త ఫక్రుద్దీన్‌ ఏటా ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. గతేడాది మాత్రం ఎగ్జిబిషన్‌ పెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఎగ్జిబిషన్‌ నిర్వహించాలంటే ‘ఎమ్మెల్యే ట్యాక్స్‌’ కింద రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని దగ్గుపాటి అనుచరులు తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. అంత డబ్బులు ఇచ్చుకోలేమని బతిమలాడినా వదల్లేదు. ఫక్రుద్దీన్‌పై ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు గంగారంతో పాటు గన్‌మెన్‌ షేక్షావలి దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే గన్‌మెన్‌ షేక్షావలిని పోలీసు అధికారులు సస్పెండ్‌ చేశారు. గంగారాంపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఇంత జరిగినా దగ్గుపాటి వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పు రాలేదు.

మామూళ్లు ఇవ్వలేదని మద్యం దుకాణానికి నిప్పు

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్ల నుంచి ప్రతి నెలా ‘ఎమ్మెల్యే ట్యాక్స్‌’ కింద మామూళ్లు వెళుతున్నాయి. అయితే డీమార్ట్‌ ఎదురుగా ఉన్న నంబూరి వైన్స్‌ను నంబూరి వెంకట రమణ నిర్వహిస్తున్నాడు. ఈయన టీడీపీ సానుభూతిపరుడు. దుకాణంలో తనకు వాటా ఇవ్వాలని రమణపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. తన మాట లెక్కచేయకపోవడంతో ఎమ్మెల్యే అనుచరులు పెట్రోల్‌ పోసి వైన్స్‌ దుకాణానికి నిప్పంటించారు. ఇలా వరుసగా సొంత పార్టీ వారిపైనే దాడులు, దౌర్జన్యాలు, దాష్టీకాలకు పాల్పడుతుండడంతో ఎమ్మెల్యేను కాదని ఏ పని చేయాలన్నా నాయకులు బెంబేలెత్తిపోతున్నారు.

రూ.200 కోట్ల ఆరోపణలపై

నోరెత్తని దగ్గుపాటి

రెండేళ్ల వ్యవధిలోనే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ రూ.200 కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నారని సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఆరోపణలు చేశారు. నగరంతో పాటు రూరల్‌ పరిధిలో ఏ స్థలం అమ్మాలన్నా.. కొనాలన్నా ఎమ్మెల్యే అనుమతి అడుగుతున్నారని, అలాగే ప్రతి నెలా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే బహిరంగంగా ఆరోపణలు చేసినా ఇప్పటివరకు వీటిపై దగ్గుపాటి స్పందించకపోవడం గమనార్హం.

గంగారం... దూరం దూరం

ఎమ్మెల్యే దగ్గుపాటికి గంగారాం నమ్మిన బంటుగా ఉన్నారు. దగ్గుపాటి ఏ చిన్న పని చేయాలన్నా గంగారాంతో చేయించారు. మద్యం దుకాణాల నుంచి అక్రమ వసూళ్లు, సివిల్‌ పంచాయితీలు, పోలీస్‌ స్టేషన్లలో సెటిల్‌మెంట్లు, మాట వినని వారిపై దాడులు మొదలైనవన్నీ గంగారాం కనుసన్నల్లోనే జరిగాయి. పంపకాల్లో తేడా రావడంతో గంగారాంను ఎమ్మెల్యే దూరం పెడుతూ వచ్చారు. ఓ వైన్‌ షాపుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పై నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు గంగారాంను అరెస్ట్‌ చేశారు. ఇక అప్పటి నుంచి గంగారాంను ఎమ్మెల్యే పూర్తిగా దూరం పెట్టారు. చేయించిన ఎమ్మెల్యేను వదిలేసి చేసిన తనను జైలుకు పంపించారని గంగారాం తన అనుచరుల వద్ద రగిలిపోతూ కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యేపై బూతుపురాణం లంకించిన సంగతి తెలిసిందే.

ఇళ్ల స్థలాలు అడిగినందుకు బెదిరింపులు

ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే 1000 మంది మైనార్టీలకు నివేశన స్థలం ఇవ్వడంతో పాటు ఇళ్లు కట్టించి ఇస్తానని దగ్గుపాటి ప్రసాద్‌ హామీ ఇచ్చారు. గెలిచాక హామీపై నోరు మెదపకపోవడంతో టీడీపీ మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహబూబ్‌బాషా ప్రశ్నించారు. దీన్ని ఎమ్మెల్యే సహించలేకపోయారు. బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తన కుమారుడిపై హత్యాయత్నం కేసు పెట్టించారని, తన కూతురి వివాహ సమయంలో కుటుంబాన్ని ఇబ్బందిపెట్టడంతో పెళ్లి కూడా రద్దయ్యిందని మహబూబ్‌బాషా శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌ ఎదుట శుక్రవారం విలపించారు. ఇలా సొంత పార్టీ నేతలు, కార్యకర్తల ఎదుగుదలను ఎమ్మెల్యే ఓర్వలేకపోతున్నారని టీడీపీ కేడరే బహిరంగంగా విమర్శిస్తుండడం గమనార్హం.

వరుస వివాదాల్లో అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే

సొంత పార్టీ కేడర్‌పైనే అక్రమ కేసుల బనాయింపు

అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వేధింపులే

ఎమ్మెల్యే అక్రమాలపై భగ్గుమంటున్న బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement