కక్షలకు ఆజ్యం పోస్తున్న పరిటాల సునీత | - | Sakshi
Sakshi News home page

కక్షలకు ఆజ్యం పోస్తున్న పరిటాల సునీత

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

ఆత్మకూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి సస్యశ్యామలంగా ఉన్న రాప్తాడు నియోజకవర్గంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది.. ఎమ్మెల్యే పరిటాల సునీత పల్లెల్లో కక్షలకు ఆజ్యం పోస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఘర్షణలో గాయపడి అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అనూష, హరికుమార్‌, మహేంద్ర, శివానందను మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గొరిదిండ్లలో అనూష అనే మహిళపై టీడీపీ కార్యకర్త అక్కులప్ప కత్తితో దాడి చేశాడన్నారు. అక్కులప్ప అనుచరులు మరో ముగ్గురిపై విచక్షణరహితంగా కత్తులు, గొడ్డలితో దాడి చేశారని, కనగానపల్లి అక్కులప్ప అనే వ్యక్తి అనూషను అత్యాచారం చేయబోయాడని తెలిపారు. అనూషకు మద్దతు ఇచ్చిన వారిపై మధు, సతీష్‌, సోమశేఖర్‌, రామాంజనేయులు కత్తులు, గొడ్డలితో దాడి చేశారన్నారు. అయితే అక్కులప్పను మాత్రమే పోలీసులు అరెస్ట్‌ చేశారని, మిగిలిన నలుగురిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళను అత్యాచారం, చంపబోతే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. మదిగుబ్బ తండాలో ఓ మహిళను హత్య చేస్తే పోలీసులు కేసు తీసుకోకుండా ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు. నిందితులు నెల రోజులుగా గ్రామంలో తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సనప గ్రామంలో పోతులయ్య అనే వ్యక్తి ఇంట్లో రూ.18 లక్షల విలువైన నగలు దొంగతనం జరిగితే టీడీపీ నేతలే దొంగతనం చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. దొంగలకు, రేపిస్ట్‌లకు, హత్యలు చేసేవారికి పరిటాల సునీత మద్దతు పలుకుతూ గ్రామాల్లో కక్షలు రేపుతున్నారన్నారు. దాడులు చేసిన వారు అధికార పార్టీ నేతలు అయితే వారిని పోలీస్‌ స్టేషన్‌లో కూర్చోబెట్టి టీ, కాఫీలు ఇస్తున్నారన్నారు. అదే గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ కుళ్లాయప్ప ప్రమేయం ఉందని బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారని, అనంతపురం రూరల్‌ మండలం కొడిమిలో అంజనాదేవి అనే మహిళపై అత్యాచారయత్నం చేస్తే మహేంద్రరెడ్డి, మహేశ్వరరెడ్డితో పాటు మరొకరు ఆమెను వివస్త్రను చేసి, రాళ్లు, కట్టెలతో దాడి చేశారన్నారు. పోలీసులు మాత్రం దాడులకు పాల్పడిన వారి దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకొని బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాపంపల్లి వాసుదేవరెడ్డి ,ముత్యాలరెడ్డి, గొరిదిండ్ల నరసింహ, సునీల్‌దత్తారెడ్డి, సుధీర్‌రెడ్డి, హనుమంతు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement