అనంతపురం సిటీ: మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, వీటిని నిర్లక్ష్యం చేస్తే కంటి సమస్యలు, కిడ్నీ వైఫల్యం, గుండెపోటు, స్ట్రోక్, పాదాల సమస్యలు వస్తాయని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ’మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంచితే.. ప్రాణానికి రక్షణ’ అనే నినాదంతో 30 రోజుల పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగే సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని గురువారం అనంతపురంలోని నాయక్‌నగర్‌లో ఉన్న అర్బన్‌హెల్త్ సెంటర్‌లో ఆయన ప్రారంభించారు. నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ప్రత్యేక స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
డ్యాన్స్ చేస్తూ
కుప్పకూలిన యువకుడు
● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
గుత్తి: వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో నివాసముండే అశోక్‌కుమార్ (26) బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం సంబరాల్లో పాల్గొన్నాడు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి కింద పడిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని కర్నూలు ఆస్పత్రికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడు అశోక్ కుమార్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసేవాడు. మృతుడికి భార్య ప్రశాంతి ఉన్నారు.
సెలవులో ఉద్యానశాఖ డీడీ
అనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీహెచ్) డి.ఉమాదేవి గురువారం నుంచి 40 రోజుల పాటు సెలవు పెట్టారు. కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికా వెళుతున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. తిరిగి నవంబర్‌లో డీడీగా బాధ్యతలు చేపడతారన్నారు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ బీసీ ధనుంజయకు ఇన్‌చార్జి డీడీ బాధ్యతలు అప్పగిస్తూ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాషా తెలిపారు.
గల్లంతైన యువకుడి మృతి
బొమ్మనహాళ్: వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని హెచ్చెల్సీ కాలువలో గల్లంతైన సాయిభరత్ (22) మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ నబీరసూల్ వివరాల మేరకు.. ఉప్పరహాళ్ క్రాస్ వద్ద నివాసం ఉంటున్న శీనా కుమారుడు సాయిభరత్ బుధవారం సాయంత్రం నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాడు. నిమజ్జనం అనంతరం అందరూ గోడిసెలపల్లి రోడ్డులోని హెచ్చెల్సీ కాలువలో స్నానం చేస్తుండగా సాయిభరత్ కూడా కాలువలోకి దూకాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం కణేకల్లు మండలంలోని యర్రగుంట గ్రామ సమీపంలో సాయిభరత్ మృతదేహం లభ్యమైంది. మృతుడు తండ్రి శీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సమ్మర్ స్టోరేజ్
ట్యాంకుకు గండి
బొమ్మనహాళ్: మండలంలోని ఏలంజి గ్రామ సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గురువారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో ట్యాంక్‌లో నిల్వ ఉన్న తాగునీరు భారీగా వృథా అవుతోంది. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా హెచ్చెల్సీ నుంచి వచ్చే నీటిని ఈ ట్యాంక్‌లో నిల్వ చేసి, చుట్టూ పక్కల ఉన్న 16 గ్రామ పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కీలకమైన నీటి నిల్వ ట్యాంక్‌కు గండి పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ట్యాంక్‌కు గండి పడిన విషయం తెలుసుకున్న డీఈఈ రామారావు, ఏఈఈ భార్గవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ట్యాంక్ నుంచి నీరు బయటకు వస్తున్న నేపథ్యంలో పనులు చేయడానికి వీలు కావడం లేదన్నారు. ట్యాంక్‌లో నీటిని ఒక్కటిన్నర అడుగు మేర ఉంచి రింగ్ బండ్‌ను ఏర్పాటు చేసిన తర్వాతే గండి పూడ్చేందుకు వీలవుతుందన్నారు. వీలైనంత త్వరగా గండి పూడ్చివేసి ట్యాంక్‌లోకి హెచ్చెల్సీ నీటిని నింపుతామని డీఈఈ తెలిపారు.


