నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

ఎస్పీ జగదీష్‌

అనంతపురం సెంట్రల్‌: జిల్లా కేంద్రంలో వినాయకుల శోభాయాత్ర, నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జగదీష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో పోలీసు సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లు, రెవెన్యూ, మున్సిపల్‌, ఫైర్‌ సర్వీస్‌ సిబ్బందిని నియమించామన్నారు. డీజేలకు అనుమతి లేదని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగజేయరాదన్నారు. మద్యపానం చేసి వేడుకల్లో పాల్గొనరాదన్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీసులు సూచించిన మార్గాల్లోనే శోభాయాత్రలు నిర్వహించి కమిటీ సభ్యులు, యువత సహకరించాలని కోరారు.

● 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు విగ్రహాలను ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలోని హంద్రీ–నీవా కాలువలో, అంత కంటే తక్కువ విగ్రహాలను అనంతపురం రూరల్‌ మండలం రాచానపల్లి అక్కమ్మగార్ల గుడి వద్ద చెక్‌డ్యాంతో పాటు న్యూ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద నిమజ్జనం చేయాలి.

● నిమజ్జనోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గుత్తి వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు గుత్తి రోడ్డులోని మిర్చి యార్డు నుంచి, తాడిపత్రి వైపు నుంచి వచ్చే బస్సులు ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా, కళ్యాణదుర్గం, బళ్లారి, రుద్రంపేట వైపు నుంచి వచ్చే బస్సులు తపోవనం, తడకలేరు, గుత్తి రోడ్డు నుంచి మిర్చియార్డు మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలి.

ఇళ్ల స్థలాలు అడిగితే ఎమ్మెల్యే వేధిస్తున్నాడు

శాసనసభ కమిటీ ఎదుట టీడీపీ నాయకుడు ఆవేదన

అనంతపురం అర్బన్‌: ‘‘పార్టీ కోసం.. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ గెలుపు కోసం పనిచేసినందుకు వేధింపులు, నాలుగు పోలీసు కేసుల రూపంలో సరైన బహుమతి ఇచ్చారు’ అంటూ శాసనసభ మైనారిటీల సంక్షేమ కమిటీ ఎదుట టీడీపీ మైనారిటీ నాయకుడు ఐఎంఎంబాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో కమిటీ చైర్మన్‌ మహమ్మద్‌ నసీర్‌ అహమ్మద్‌తో వాదనకు దిగారు. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు బయటకు తీసుకెళ్లారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో కమిటీకి బాషా వినతిపత్రం అంద జేసి పరిస్థితి వివరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి విజయం కోసం అలుపెరగకుండా పనిచేశానని చెప్పారు. అనంతరం మీడియాతో బాషా మాట్లాడారు. దగ్గుపాటి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే ముస్లిం మైనారిటీలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరగా ఆయన సరే అన్నారని, అయితే రెండున్నరేళ్లయినా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని వాపోయారు. ఇదే విషయంపై తమ వాళ్లు ఎక్కడపడితే అక్కడ నిలదీస్తున్నారని చెప్పారు. ఇళ్ల స్థలాల గురించి అడిగితే ఎమ్మెల్యే తనపై వ్యతిరేక ముద్రవేసి వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుకు ఫోన్‌ చేస్తే సమాధానం ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికే తనపై నాలుగు కేసులు పెట్టారని ఆవేదన చెందారు.

ఎం.కొండాపురం పంచాయతీకి ఐఎస్‌ఓ గుర్తింపు

అనంతపురం ఎడ్యుకేషన్‌: కళ్యాణదుర్గం మండలం ఎం.కొండాపురం గ్రామ పంచాయతీకి నీటి సమృద్ధి అంశం కింద ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. సమర్థవంతమైన నీటి నిర్వహణతో పాటు ప్రజలకు నీటి సదుపాయాలు కల్పించేందుకు పంచాయతీ చేపట్టిన చర్యలకు గుర్తింపు లభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు తెలిపారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కమిషనర్‌ కృష్ణతేజ చేతుల మీదుగా డిప్యూటీ ఎంపీడీఓ రంగనాయకులు, పంచాయతీ కార్యదర్శి లోకేష్‌ ఐఎస్‌ఓ ధ్రువపత్రాన్ని అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement