● 20 కిలో మీటర్ల నుంచి పైపులైన్లు
● చీనీచెట్లను కాపాడుకునేందుకు రైతుల కష్టాలు
● ట్యాంకర్ నీరు రూ.వెయ్యి పైమాటే ..
యల్లనూరు: ఆరుగాలం శ్రమించి పంటలను సాగు చేసిన అన్నదాతలను పుట్టెడు దుఃఖాలు వెంటాడుతున్నాయి. సాగు చేసిన పంటలకు సైతం నీరు లేక నిట్టనిలువునా ఎండుతుంటే.... చేసేది లేక చీనీ, అరటి చెట్లను కొందరు రైతులు వదిలేసుకుంటున్నారు. కరువు విలయతాండవం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వంతో పాటు ఉద్యాన, వ్యవసాయ అధికారుల్లో చలనం లేదు. కనీసం ప్రభుత్వానికి నివేదికలను రాసి పంపితే పంట నష్టపరిహారం జాబితాలో చేర్చేందుకు కూడా ఉద్యాన అధికారులు ప్రయత్నించడం లేదు.
1400 అడుగుల్లో బోర్లు వేస్తున్నా...
పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి, బాలాపురం తదితర గ్రామాల్లో రైతులకు గంగజాడ కరువైంది. 1400 అడుగుల లోతులో బోర్లు వేస్తున్నా గంగజాడ దొరకడం లేదు. దీంతో చేసేదిలేక యల్లనూరు మండలం తిరుమలాపురం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బోరు వద్ద నుంచి ట్యాంకర్లతో నీటిని తరలిస్తూ చీనీ, దానిమ్మ, అరటి చెట్లను కాపాడుకుంటున్నారు. ఒక్కో ట్యాంకరుకు రూ.1000 కి పైగా ఖర్చు చేస్తున్నారు. వందల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేసిన అన్నదాతలకు నీరు కరువవడంతో నీళ్లకోసం రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. యల్లనూరు మండలం చిలమకూరు చిత్రావతి నదిలో పుట్లూరు గ్రామాల రైతులు బోర్లు వేసుకొని అక్కడి నుంచి పైపులైను సహాయంతో నీటిని తీసుకెళ్లేందుకు రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పుట్లూరు మండలానికి పుట్లూరు చెరువు, కోమటికుంట్ల చెరువులు, గండికోట నీరు వస్తే రైతులు కాస్త ఊపిరి పీల్చుకునేవారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి రైతుల కోసం పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు నీరు విడుదల చేయిస్తే సగం కష్టాలు గట్టెక్కుతామని పలువురు రైతులు చెబుతున్నారు. కరువు పరిస్థితులు ఇలాగే కొనసాగితే నవంబర్‌లోపు పుట్లూరు, యల్లనూరు మండలాల భూములన్నీ బీడు భూములుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిలమకూరు చిత్రావతి నది నుంచి కోమటికుంట్లకు రైతులు వేసుకుంటున్న పైప్‌లైన్
తిరుమలాపురం తోటల వద్ద పుట్లూరుకు ట్యాంకర్లతో నీటిని నింపుకుంటున్న వ్యాపారులు


