● ‘శ్రీరామరెడ్డి’ ప్రాజెక్టు కార్మికుల స్పష్టీకరణ
కూడేరు/అనంతపురం న్యూటౌన్ : ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఈ నెల 20 నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ కార్మికులు సమ్మెకు దిగనున్నట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్, ప్రాజెక్ట్ కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రకోడు ఎర్రిస్వామి తెలిపారు. గురువారం వారు మండలంలోని శ్రీరామరెడ్డి ప్రాజెక్ట్ వద్ద కార్మికులతో సమావేశమయ్యారు. న్యాయపరమైన డిమాండ్ల సాధనకు అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ప్రాజెక్ట్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్ట్‌లో 600 మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ 5 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికుల కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ బకాయిల చెల్లింపుతో పాటు తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫేజ్–4 కార్మికుల వేతన కోతలను ఉపసంహరించుకోవాలన్నారు. 18 ఫిల్టర్ బెడ్లు, మోటార్లు సక్రమంగా పని చేయడం లేదని, నిర్వహణ లోపాలను సరిచేయాలని కోరారు. రెండు రోజుల్లో డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు నారాయణ స్వామి, రమేష్, వన్నూరు స్వామి రాజా, నేసే ఎర్రిస్వామి, సుధాకర్ పాల్గొన్నారు.


