ఫుట్‌బాల్‌ టోర్నీ ఫైనల్స్‌కు తమిళనాడు, మణిపూర్‌ | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ టోర్నీ ఫైనల్స్‌కు తమిళనాడు, మణిపూర్‌

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

అనంతపురం: డాక్టర్‌ తాలిమెరెన్‌ ఆవో అండర్‌–19 బాలికల ఫుట్‌బాల్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో ఇప్పటి వరకూ జార్ఖండ్‌ కొనసాగిస్తూ వచ్చిన విజయ ప్రస్థానానికి డిఫెండింగ్‌ చాంపియన్‌ మణిపూర్‌ జట్టు కళ్లెం వేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నెల 10 నుంచి ఆర్డీటీ స్టేడియం వేదికగా 15 రాష్ట్రాల జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు, ఏపీ జట్లు తలపడ్డాయి. ఏపీ జట్టుపై 12–1 గోల్స్‌ తేడాతో తమిళనాడు జట్టు ఘన విజయం సాధించింది.

పైచేయి సాధించిన మణిపూర్‌

మధ్యాహ్నం జరిగిన మొదటి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో జార్ఖండ్‌, మణిపూర్‌ జట్లు తలపడ్డాయి. నువ్వానేనా అనే రీతిలో సాగిన ఈ మ్యాచ్‌లో జార్ఖండ్‌ జట్టు మొదట ఓ గోల్‌ చేసింది. ఛాలెంజ్‌గా తీసుకున్న మణిపూర్‌ జట్టు చెలరేగిపోయింది. మరో 6 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా మణిపూర్‌ క్రీడాకారిణి తంగ్‌జమ్‌ విక్టోరియా దేవి ఓ గోల్‌ చేయడంతో మ్యాచ్‌ ఫలితం సమంగా మారింది. దీంతో నిబంధనల మేరకు ఇరు జట్లకు చెరో ఐదేసి పెనాల్టీ షూటౌట్‌లు కేటాయించారు. ఈ అవకాశాన్ని మణిపూర్‌ జట్టు క్రీడాకారులు సద్వినియోగం చేసుకున్నారు. ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ మణిపూర్‌ క్రీడాకారులు దాసిలా సేస్టమ్‌, మంగలేబి ఇరోమ్‌, అగున్‌వాంగ్లియు ఖేంగ్‌తామెయ్‌, రించుయిలా గాంగ్మెయ్‌ వరుసగా నాలుగు గోల్స్‌ సాధించి జట్టు విజయంలో కీలకంగా మారారు. జార్ఖండ్‌ జట్టు రెండు గోల్స్‌కే పరిమితమైంది. దీంతో మణిపూర్‌ జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. మ్యాచ్‌లను ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్‌, కార్యదర్శి డానియల్‌ ప్రదీప్‌, జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు దాదాఖలందర్‌ పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement