చోరీ ఘటనపై లోతుగా దర్యాప్తు | - | Sakshi
Sakshi News home page

చోరీ ఘటనపై లోతుగా దర్యాప్తు

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

ఉరవకొండ: పట్టణ శివారు లత్తవరం రోడ్డు పక్కన నివాసముండే రైతు మాదినేని శ్రీనివాసులు ఇంట్లో బుధవారం రాత్రి జరిగిన భారీ చోరీ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం చోరీ జరిగిన ఇంటిని సీసీఎస్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో పాటు డాగ్‌ స్క్వాడ్‌ , క్లూస్‌ టీం బృందాలు తనిఖీ చేశారు. రైతు ఇంట్లో మంచం కింద ప్రత్యేకంగా బ్యాగులో దాచిన రూ.45 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు... దేవుడి గదిలో ఉంచిన రూ.2లక్షలు, మరో చోట ఉంచిన రూ.50వేలు చోరీ చేయకపోవడం పలు అనుమాలకు తావిస్తోంది. ఈచోరీ తెలిసిన వ్యక్తుల పనేనా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. బాదిత రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవలే తన పొలాన్ని రూ.60లక్షలకు విక్రయించిన డబ్బులో రూ.45లక్షలను తన కుమారుడి వివాహం, ఇంటి నిర్మాణం కోసం ఇంట్లో దాచిపెట్టుకోని ఉంటే దాన్ని చోరీ చేశారని వాపోయారు.

ఉరేసుకున్న వ్యక్తి కర్ణాటక వాసి

కూడేరు: మండల పరిధిలోని ఉదిరిపికొండ–శివరాంపేట గ్రామాల మధ్య అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తిని కర్ణాటక వాసిగా పోలీసులు గుర్తించారు. గురువారం మృతుడి వివరాలను పోలీసులు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని మొలకల్మూరు తాలుకా కొండపల్లికి చెందిన రుద్రప్ప, నాగలక్ష్మి దంపతుల కుమారుడు మైలాడి (25), కుమార్తె ఉన్నారు. వీరు ఈ నెల 9న ఉరవకొండ మండలం పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనార్థం వచ్చారు. మైలాడికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఉదిరిపికొండ వైపు వచ్చాడు. కుటుంబ సభ్యులు అతని కోసం వెతికినా కనిపించలేదు. వారు ఉరవకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి స్వగ్రామానికి వెళ్లి పోయారు. ఆ తర్వాత మైలాడి చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు అతని భుజాలపై ఉన్న పచ్చబొట్టు అక్షరాల ఆధారంగా బళ్లారి పోలీసులకు సమాచారమివ్వగా వారి ద్వారా మృతుడి ఆచూకీ లభించడంతో మిస్టరీ వీడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement