ఉరవకొండ: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు నెలకొందని, ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి కలెక్టర్ ఆనంద్‌ను కోరారు. గురువారం అనంతపురంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి ఆయనకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జిల్లాలో సెప్టెంబర్ రెండో వారం దాటినప్పటికీ తగినంత వర్షపాతం నమోదుకాక బోరుబావులు ఎండిపోతున్నాయన్నారు. వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భజలాలు పూర్తిగా అడుగంటే పరిస్థితి నెలకొందన్నారు. చాలా మంది రైతులు పంటలు సాగుచేసి వాటిని కాపాడుకోలేక అప్పుల పాలవుతున్నారన్నారు. ముఖ్యంగా జిల్లాలో పశువులకు మేత, తాగునీరు అందక కబేళాలకు తరలిస్తున్నారని చెప్పారు. కనీసం పశువుల దాహర్తి తీర్చడానికి జిల్లాలోని అన్నీ చెరువులను హంద్రీనీవా నీటితో నింపాలన్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రతి గ్రామంలో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ అందేలా చూడాలన్నారు. బ్యాంకుల్లో రైతుల రుణాలన్నీ మాఫీ చేసి, వ్యవసాయ పనులు లేక అవస్థలు పడుతున్న వారికి ఉపాధి పనులు కల్పించాలన్నారు. ప్రస్తుత పనిదినాలకు అదనంగా మరో 50 రోజులు పని కల్పించేలా చూడాలన్నారు.


