అనంతపురం ఎడ్యుకేషన్: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) సి.మనోజ్‌కుమార్ కుటుంబానికి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అండగా నిలిచింది. సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ.3,11,786 ఆర్థిక సాయం అందజేశారు. డీఎస్సీలో పాఠశాల సహాయకుడు (వ్యాయామ విద్య)గా ఎంపికై గుత్తి మండలంలోని ఏపీఆర్‌డబ్ల్యూఆర్ సేవాగఢ్ పాఠశాలలో చేరిన మనోజ్‌కుమార్ (26) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిన్న వయసులోనే తోటి ఉపాధ్యాయుడిని కోల్పోవడం బాధాకరమని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. మనోజ్‌కుమార్ కుటుంబాన్ని తమ సొంత కుటుంబంగా భావించిన జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా విరాళాలు అందించారు. ఈ మేరకు సేకరించిన రూ.3,11,786 చెక్కును జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆయ్యూబ్ హుస్సేన్ చేతుల మీదుగా బుధవారం మనోజ్‌కుమార్ తండ్రి సి.మద్దిలేటికి అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఇ.సిరాజుద్దీన్, కోశాధికారి జి.జగదీశ్వరయ్య, ఉపాధ్యక్షురాలు కె.సమీరా, సంయుక్త కార్యదర్శి ఎ.జ్యోతి, సభ్యులు గట్టు నాగరాజు, కుమారరాజు, సత్యనారాయణ, రమేష్‌బాబు, నాగరాజు, ముస్తఫా, నందకుమార్, శకుంతల, కోటప్ప, రాణి పాల్గొన్నారు.


