అనంతపురం సిటీ: జిల్లా సర్వజనాస్పత్రికి శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద ఉన్న మోబిస్ ఇండియా మోడ్యూల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేయూతనందించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అత్యంత ఖరీదైన స్కాన్‌మొబైల్ డీఆర్ లైట్ ఎక్స్‌రే పరికరాన్ని వితరణ చేసింది. ఈ యంత్రం పనితీరును మోబిస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యాంగ్‌యోంగ్–డ్యూక్, హెచ్‌ఆర్‌జీఏ విభాగాధిపతి పి.ఎన్.శ్రీనివాస్, కంపెనీ సీఎస్‌ఆర్ ఇన్‌చార్జ్, ప్రముఖ న్యాయవాది సింధూజ పరిశీలించి, బుధవారం జీజీహెచ్ రేడియాలజీ విభాగానికి అందజేశారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి మాట్లాడుతూ మోబిస్ కంపెనీ అందించిన స్కాన్‌మొబల్ డీఆర్ లైట్ ఎక్స్‌రే పరికరం హై ఫ్రీక్వెన్సీతో మంచి పనితీరును కనబరుస్తుందన్నారు. గ్రామ కదలలేని స్థితిలో మంచంపై ఉన్న రోగులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. క్యాజువాలిటీ ఎమర్జెన్సీ, ఏఎంసీయూ విభాగాల్లో ఈ యంత్రం సేవలను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ పరిపాలన అధికారి, డిప్యూటీ కలెక్టర్ వి.మల్లికార్జునరెడ్డి, జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ, సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.


