ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Sep 16 2026 3:37 AM | Updated on Sep 16 2026 3:37 AM

కూడేరు: గుర్తు తెలియని వ్యక్తి తన షర్టుతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడేరు మండల పరిధిలోని ఉదిరిపికొండ–శివరాంపేట గ్రామాల మధ్య అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. మంగళవారం రహదారి వెంట వెళుతున్న వాహనదారులకు దుర్వాసన రావడంతో చెట్టు దగ్గర పరిశీలించగా నల్లగా మారిపోయి చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి కనిపించాడు. పోలీసులకు సమాచారమందిచండంతో సీఐ రాజు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మనిషి ఊదెక్కి, పురుగులు పట్టి ఉన్నాడు. ఒక భుజంపై ఆర్‌కే అని మరొక భుజంపై మేఘా అని కన్నడలో పచ్చతో రాసిన అక్షరాలున్నాయి. అక్కడ ఇతరత్రా ఏ ఆధారాలు లభించలేదు. దీంతో జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లకు అతని ఆచూకీ కోసం సమాచారమందించారు. అతని శరీర పరిస్థితిని బట్టి 4–5 రోజులు క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని, 35–40 ఏళ్లలోపు వయసు ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు.

రైలు కింద పడి బేల్దారి..

గుత్తి: గుత్తి ఆర్‌ఎస్‌లోని గౌతమేశ్వరాలయం సమీపంలో మంగళవారం బేల్దారి వెంకటేసులు (54) గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లులోని ఉమామహేశ్వర నగర్‌కు చెందిన వెంకటేసులు ఇటీవల ఆదోనికి మకాం మార్చాడు. రెండు సంవత్సరాల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో మనోవేదనకు గురైన ఆయన మానసిక రోగిగా మారాడు. మద్యానికి బానిసయ్యాడు. అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు. మంగళవారం స్థానిక గౌతమేశ్వరాలయం సమీపంలో గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కీ మ్యాన్‌ శ్రీనివాసులు గమనించి కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది. జీఆర్‌పీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

నేమకల్లు అంజన్న ఆదాయం రూ.11.69 లక్షలు

బొమ్మనహాళ్‌: మండలంలోని నేమకల్లు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా రూ.11.69 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్త శ్రీనాథ్‌శెట్టి, ఈఓ నరసింహారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సేవా టికెట్ల ద్వారా రూ.1.70 లక్షలు, తాత్కాలిక హుండీల ద్వారా రూ.3.95 లక్షలు, అన్నదాన విరాళాల రూపంలో రూ.6.04 లక్షలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. జీర్ణోద్ధారణ పనులు జరుగుతున్న సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. త్వరలో భూమి పూజ తర్వాత ఆలయ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తుల్లో అపోహలు కలిగించేలా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

వేంకటేశ్వరస్వామి

ఆలయంలో చోరీ

కళ్యాణదుర్గం రూరల్‌: కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీటీ ఆసుపత్రి ఎదుట ఉన్న వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దొంగలు పడ్డారు. మంగళవారం ఉదయం పూజ నిమిత్తం ఆలయానికి వెళ్లిన అర్చకులకు వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం, ఆలయ తాళం తీసి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఆలయంలోని పవిత్రమైన మంగళ సూత్రం, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. వీటి విలువ రూ. 2 లక్షలకు పైగా ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నిత్యం జన సంచారం ఉండడంతో పాటు పేరుగాంచిన ఆలయంలో దొంగతనం జరగడంపై స్థానికులు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దొంగల కదలికలు రికార్డయ్యాయి. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యుదాఘాతంతో

యువకుడి మృత్యువాత

గుత్తి రూరల్‌: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన విక్రమ్‌(19) అనే యువకుడు మంగళవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మృతుడి తండ్రి మురార్జీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉప్పర్లపల్లికి చెందిన విక్రమ్‌ ట్రాక్టర్‌ హమాలీగా పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. గ్రామ శివారులో నుంచి ట్రాక్టర్‌లో రాళ్లు లోడ్‌ చేసుకుని తన ఇంటికి సమీపంలోకి తరలించాడు. రాళ్లు అన్‌లోడ్‌ చేస్తున్న క్రమంలో పైనున్న విద్యుత్‌ తీగలకు ట్రాలీ తగిలింది. దీంతో విద్యుత్‌ ప్రసరించి ట్రాలీలో ఉన్న విక్రమ్‌ ఒక్కసారిగా కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విక్రమ్‌ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement