అనంతపురం సెంట్రల్: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 40 లక్షల విలువైన 21 కిలోల వెండి ఆభరణాలు, కరిగించిన వెండి, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అనంతపురంలోని జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను ఎస్పీ జగదీష్ వెల్లడించారు.
వ్యసనాలకు బానిసలై..
అనంతపురం రూరల్ మండలం నందమూరి నగర్‌కు చెందిన కురపాటి సాయికుమార్, అక్కంపల్లికి చెందిన కనుమక్కుల చాంద్‌బాషా, శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం కొడిగినెహళ్లికి చెందిన గుండప్పగారి సూదం ముఠాగా ఏర్పడ్డారు. సర్వీసింగ్ సెంటర్లో వర్కర్, కూలీ పనులు చేసుకునే వీరు వ్యసనాలకు బానిసలయ్యారు. జల్సాలను తీర్చుకునేందుకు దేవాలయాలను టార్గెట్‌గా చేసుకున్నారు. కాపలాలేని దేవాలయాలను ఎంచుకొని ఎవరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడేవారు. సీసీ కెమెరాలు ఉన్నా.. వాటిలో రికార్డు కాకుండా స్ప్రే ద్వారా లెన్స్‌ను బ్లర్ చేయడం, కొన్ని చోట్ల డీవీఆర్‌లను ఎత్తుకెళ్లారు. కంబదూరు మండలం రాంపురం మారెమ్మ ఆలయంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుల వివరాలు వెల్లడయ్యాయి. అనంతరం వారిని అరెస్టు చేసి విచారించగా... కంబదూరుతో పాటు బ్రహ్మసముద్రం, శెట్టూరు, పామిడి, బుక్కరాయసముద్రం, రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ ఆలయం, రొద్దం, కర్ణాటకలోని తుమకూరు, కొరటగెరె, క్యాససంద్ర తదితర చోట్ల దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, రూరల్ సీఐ నీలకంఠ, ఎస్‌ఐ లోకేష్, ఏఎస్‌ఐ గంగాధర, సిబ్బందిని ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు.


