‘తెలుగు మహిళ’పై టీడీపీ నేత దాడి | - | Sakshi
Sakshi News home page

‘తెలుగు మహిళ’పై టీడీపీ నేత దాడి

Sep 16 2026 3:43 AM | Updated on Sep 16 2026 3:43 AM

ఇంటి స్థలం వివాదంలో ఘటన

అసభ్యపదజాలంతో దూషిస్తూ జుట్టుపట్టుకుని కొట్టిన వైనం

కళ్యాణదుర్గం: తెలుగు తమ్ముళ్ల అరాచకాలు రోజురోజుకూ హద్దులు దాటుతున్నాయి. ఇన్నాళ్లూ ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్‌ చేసిన ‘పచ్చ’ మంద ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ మహిళా కార్యకర్తపై దాడికి తెగబడింది. ఒకటిన్నర సెంటు ఖాళీ స్థలానికి సంబంధించిన వివాదంలో టీడీపీ మండల మాజీ కన్వీనర్‌ కీలకపాత్ర పోషించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వన్నప్ప వద్ద నుంచి కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన టీడీపీ మండల మాజీ కన్వీనర్‌ డీకే రామాంజనేయులు కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే మొత్తం స్థలం తనదేనంటూ సోమవారం జేసీబీతో చదును చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో సదరు స్థలం తమదని అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగమణి అడ్డుకునేందుకు యత్నించింది. ఈ క్రమంలో నాగమణి, ఆమె కోడెలు కళ్యాణిపై డీకే రామాంజనేయులు బూతులతో రెచ్చిపోయాడు. అసభ్య పదజాలంతో వారిని దూషిస్తూ వారిపైకి రాళ్లతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా కుటుంబ సభ్యులతో కలిసి వారిపై పైపులతో దాడికి యత్నించాడు. ఇంటి నుంచి బయటికి వచ్చిన నాగమణి మరోసారి జేసీబీకి అడ్డుపడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన డీకే రామాంజనేయులు ఆమెను జట్టుపట్టుకుని తీవ్రంగా కొట్టాడు. ఇదంతా గ్రామస్తులు కళ్లెదుటే జరుగుతున్నా... వారించే సాహసం చేయలేదు. కాగా సదరు స్థలం వివరాలు రెవెన్యూ రికార్డుల్లో లేవు. ఏ ఒక్కరూ తమకు చెందినట్లుగా ఎలాంటి ఆధారాలూ తీసుకురాలేదని రెవెన్యూ అధికారులు స్పష్టంచేశారు. ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కళ్యాణదుర్గం రూరల్‌ పోలీసులు స్పందించారు. ఇరు వర్గాలను వారి వద్ద ఉన్న స్థలానికి సంబంధించిన రికార్డులను తీసుకు రావాలని సూచించినట్లు సమాచారం.

అమిలినేని ఇలాకాలో

రెచ్చిపోతున్న ‘తమ్ముళ్లు’

కళ్యాణదుర్గంలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం పెరిగిపోయింది. ఇటీవల కళ్యాణదుర్గం నార్త్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై తెలుగు టీచర్‌ రామచంద్ర నాయక్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. ఘటనపై పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో బాలిక తల్లిదండ్రులను రాజీ కుదుర్చేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యవర్తిగా ఉండి రాజకీయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం 3వ తరగతి చదువుతున్న ఓ బాలికను లోబర్చుకునేందుకు ఓ జేసీబీ డ్రైవర్‌ యత్నించగా దేహశుద్ధి చేసి, స్థానికులు సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. అయితే సదరు ఘటనలో కేసు లేకుండా ఉండేందుకు టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చి రాజకీయానికి తెర లేపారనే ఆరోపణలు వినిస్తున్నాయి. ఇలా ప్రతి విషయంలోనూ టీడీపీ నేతలు జోక్యం చేసుకుంటూ సొంత పార్టీ కార్యకర్తలపైన, సామాన్య ప్రజలపైన ప్రతాపం చూపుతూ రెచ్చిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాగమణి, కళ్యాణిలపై దాడి చేస్తున్న టీడీపీ మండల మాజీ కన్వీనర్‌ డీకే రామాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement