● పాఠాలు చెప్పాల్సిన చోట పాడు పనులు
● ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఘటనలు
● విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే కొందరు గాడి తప్పుతున్నారు. గురువు అంటే తల్లిదండ్రులతో సమానంగా గౌరవించే సమాజంలో.. అదే గురువు స్థానాన్ని అడ్డుపెట్టుకుని కొందరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వస్తుండటం కలవరపెడుతోంది. ఇటీవల కళ్యాణదుర్గం, గార్లదిన్నె అంతకుముందు పామిడి, యల్లనూరు.. ఇలా జిల్లాలో వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు ‘పాఠశాలల్లో పిల్లలకు భద్రత ఉందా?’ అన్న ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి.
నలుగురు ఉపాధ్యాయులపై చర్యలు
కళ్యాణదుర్గం పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో తెలుగు ఉపాధ్యాయుడు రామచంద్రనాయక్‌ను విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. గార్లదిన్నె మోడల్ పాఠశాలలో భౌతికశాస్త్రం బోధించే పీజీటీ చింతా నారాయణ విద్యార్థినులతో వెకిలి చేష్టలకు పాల్పడ్డాడనే ఫిర్యాదుపై అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా ఆయన్ను సస్పెండ్ చేశారు. పామిడి మండలం అప్పాజిపేట ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు యాదవ్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలిని లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. యల్లనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు సస్పెండ్ చేశారు.
‘సస్పెన్షన్’తో కథ ముగియకూడదు
బాలికల భద్రత విషయంలో ‘ఘటన జరిగింది.. సస్పెండ్ చేశాం’ అనే విధానం కాకుండా శాశ్వత పరిష్కారంపై విద్యాశాఖ దృష్టి పెట్టాలి. ప్రతి పాఠశాలలో బాలికలు నిర్భయంగా ఫిర్యాదు చేసే వ్యవస్థను బలోపేతం చేయాలి. విద్యార్థులతో క్రమం తప్పకుండా భద్రత, మంచి–చెడు స్పర్శ, ఫిర్యాదు మార్గాలపై అవగాహన కల్పించాలి. ఆరోపణలు, ఘటనలపై నిష్పక్షపాతంగా విచారించి, నిజమని తేలితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. పాఠశాల గేటు దాటిన ప్రతి బాలిక సురక్షితంగా ఇంటికి చేరుతుందన్న నమ్మకాన్ని తల్లిదండ్రులకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గురువు చేతిలో పుస్తకం ఉండాలి.. పిల్లల భవిష్యత్తును మలిచే బాధ్యత ఉండాలి.. భయపెట్టే ప్రవర్తనకు, వికృత చేష్టలకు మాత్రం చోటుండకూడదు. ఇది ఒక్కో పాఠశాల సమస్య కాదు.. పిల్లల భద్రతకు సంబంధించిన సామాజిక సమస్య. వరుస ఘటనల నేపథ్యంలో ఇప్పటికై నా విద్యాశాఖ మేల్కొని కఠినమైన పర్యవేక్షణ, స్పష్టమైన బాధ్యత, వేగవంతమైన చర్యలతో బాలికలకు భద్రత కల్పించాలి.


