అనంతపురం అర్బన్: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నవాటిని సత్వరం పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ విషుణచరణ్‌తో కలిసి కలెక్టర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జంతులూరు నుంచి కొర్రపాడు వైపు ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణం త్వరగా చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే అక్కడున్న పాత బోర్లను మినహాయించి జంతులూరులో ప్రజలకు నూతనంగా మూడు బోర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. యూనివర్సిటీ భూమి వివరాలను సమర్పించాలని బీకేఎస్ తహసీల్దార్ శ్రీధర్‌మూర్తిని ఆదేశించారు. సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కివాడే, ఫ్రొఫెసర్ హనుమాన్ కెనడి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ సుబ్బరాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల దరఖాస్తు గడువు పెంపు
అనంతపురం టౌన్: ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తుకు గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బరితెగించిన టీడీపీ మూక
● వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటి సీసీ కెమెరాలు ధ్వంసం
తాడిపత్రిటౌన్: టీడీపీ మూకలు బరితెగించాయి. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు విజయ్ ఇంటిపై దాడులకు దిగి.. సీసీ కెమెరాలను ధ్వంసం చేశాయి. దౌర్జన్యాన్ని ప్రశ్నించిన విజయ్ తల్లి లోకేశ్వరిపై దూషణలకు దిగింది. వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసపురంలోని పీర్లమాన్యంలో నివాసం ఉంటున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు విజయ్.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుల బెదిరింపుతో తాడిపత్రిని వదిలి వెళ్లాడు. ప్రస్తుతం ఇంటి వద్ద విజయ్ తల్లి లోకేశ్వరి ఒంటిరిగా జీవిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి విజయ్ ఇంటి పైనున్న సీసీ కెమెరాలను అదే కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు తలారి చంద్ర, హరినాథరెడ్డి, పటాన్ నబీషా ధ్వంసం చేశారు. శబ్దం రావడంతో బయటకు వచ్చిన లోకేశ్వరి ఏమిటీ దౌర్జన్యమని ప్రశ్నించారు. అంతే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కులం పేరుతో దూషిస్తూ మీ బతుక్కు సీసీ కెమెరాలా.. నీ కొడుకు అంతు చూస్తాం. ల..ము.. అంటూ బెదిరించారు. బుధవారం ఉదయం లోకేశ్వరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఆరోహణరావుకు సీసీ ఫుటేజీలతో సహా ఫిర్యాదు చేశారు.
నేడు, రేపు మైనారిటీల సంక్షేమ కమిటీ పర్యటన
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనారిటీల సంక్షేమ కమిటీ ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాలో పర్యటించనుందని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జి.రామసుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీ చైర్మన్ మహమ్మద్ నసీర్ అహ్మద్‌తోపాటు సభ్యులు దగ్గుపాటి ప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి, బోడే ప్రసాద్, సీహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్, షాజహాన్ బాషా, సుందరపు విజయ్‌కుమార్, ఐజక్ బాషా పర్యటనలో పాల్గొంటారని పేర్కొన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కాన్ఫరెన్స్ హాలులో మైనారిటీలకు రిజర్వేషన్ల అమలుపై వీసీతో కమిటీ సమావేశమవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు గార్లదిన్నె ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో మైనారిటీ నాయకులు, ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తుంది. అనంతరం సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు చేయనుంది. రాత్రి అనంతపురం స్టేట్ గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు. శుక్రవారం జిల్లాలో మైనారిటీల ప్రయోజనం కోసం చేపట్టిన కార్యక్రమాలు, రిజర్వేషన్ల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో కమిటీ సమావేశమవుతుంది. అనంతరం కమిటీ విజయవాడకు బయలుదేరి వెళుతుందని రామసుబ్బారెడ్డి వెల్లడించారు.


