అనంతపురం ఎడ్యుకేషన్: తీవ్ర కరువుతో అల్లాడుతున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో పంటలను కాపాడేందుకు చెరువులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా జిల్లాలోని చెరువులకు నీరు విడుదల చేసే ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 180 టీఎంసీల నుంచి 112 టీఎంసీలకు పడిపోయిందని తెలిపారు. అయినప్పటికీ 835 అడుగుల వరకు నీటిని డ్రా చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారని, పవర్ జనరేషన్ జరగని పరిస్థితుల్లో హంద్రీ–నీవాకు 3.5 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. శ్రీశైలం డ్యాంలో 854–840 అడుగుల మధ్య సుమారు 26 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సమయంలో వెలిగొండ, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నీటి విడుదల కొనసాగితే హంద్రీ–నీవాకు మరో 9 టీఎంసీల వరకు నీటిని తీసుకునే అవకాశం ఉందన్నారు. 840–830 అడుగుల మధ్య కూడా హంద్రీ–నీవా, కల్వకుర్తి, ముచ్చుమర్రి ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉందని, దీంతో మరో 4.5 టీఎంసీల వరకు హంద్రీ–నీవాకు నీరు పొందవచ్చన్నారు. ఈ లెక్కన ఇప్పటికీ శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా దాదాపు 17 టీఎంసీల నీటిని తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు.
ట్రయల్ రన్‌కే నీరు ఎందుకు?
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదని, ప్రధాన సొరంగం నిర్మాణం పూర్తయినా కాలువల వ్యవస్థ ఇంకా పూర్తి కావాల్సి ఉందని ప్రకాష్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ట్రయల్ రన్‌లో భాగంగా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితుల్లో, ఆ నీటిని తగ్గించి హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ద్వారా రాయలసీమ జిల్లాలకు మళ్లించాలని కోరారు.
ఎండిపోతున్న పంటలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో హంద్రీ–నీవా నీటిపై ఆధారపడిన చెరువులు ఉన్నాయని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. నీరు లేక చీనీ, అరటి, మిరప, టమాట తదితర పంటలు ఎండిపోతున్నాయని, భూగర్భజలాలు అడుగంటడంతో రైతులు పంటలను వదిలేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేసి, అక్కడి నుంచి పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న 49 చెరువులకు నీటిని అందించాలని ప్రకాష్‌రెడ్డి కోరారు. హంద్రీ–నీవా కింద ఉన్న అన్ని చెరువులను వెంటనే నింపడంతో పాటు హంద్రీ–నీవా నుంచి పేరూరు డ్యాంకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం గురువారం హంద్రీ–నీవా సీఈ కార్యాలయం ఎదుట జలదీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటారని చెప్పారు. తొమ్మిది నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తారని వెల్లడించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీలు చియ్యేడు కృష్ణారెడ్డి, బోయ రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి బండి పవన్, గోవిందరెడ్డి, నీరుగంటి నారాయణరెడ్డి, ఈశ్వరయ్య, పాపంపేట ప్రసాద్‌రెడ్డి, భానుకోట శివ, ఉప్పరపల్లి శీనా పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్
నేడు హంద్రీ–నీవా సీఈ కార్యాలయం ఎదుట జలదీక్ష


