గుంతకల్లు: స్థానిక హనుమేష్‌నగర్‌లో వైవీఆర్ క్యాంపు కార్యాలయం సమీపంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ప్రైమరీ స్కూల్‌లో బుధవారం మంటలు చెలరేగాయి. ఉదయం పాఠశాల స్టోర్ రూమ్ నుంచి పొగలు రావడం గుర్తించిన స్థానికులు వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డికి తెలియజేశారు. ఆమె వెంటనే ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే స్టోర్‌రూమ్‌లోని డస్ట్‌బిన్లు, పాత పుస్తకాలు, ఫర్నీచర్ కాలి బూడిదయ్యాయి. ఇటీవల పాఠశాల సమీపంలో రాత్రి పూట గంజాయి బ్యాచ్, ఆకతాయిలు తిరుగుతున్నారు. వారే స్టోర్ రూమ్‌కు నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. గదిలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌కు ఆస్కారమే లేదన్నారు. పోలీసులు రాత్రి గస్తీ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆటో దగ్ధం
గుత్తి రూరల్: మండలంలోని చెర్లోపల్లి శివారులో సేవాగఢ్ క్రాస్ వద్ద బుధవారం 67వ నంబర్ జాతీయ రహదారిపై మంటలు చెలరేగి సీఎన్‌జీ ఆటో దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుత్తి నుంచి ప్రయాణికులతో ఆటో గుంతకల్లుకు బయలుదేరింది. సేవాగఢ్ క్రాస్ వద్ద ఆటోలో నుంచి మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ ఆటోను రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులతో కలిసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అదుపు కాలేదు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏడీఎఫ్‌ఓ అశ్వర్థ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. గుంతకల్లు నుంచి సంఘటన స్థలానికి అగ్ని మాపక వాహనం వచ్చేలోగా ఆటో మంటల్లో దగ్ధమైంది. రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత ఆటో డ్రైవర్ రాముడు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అతివేగమే
ప్రమాదానికి కారణం
● పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురం గ్రామం వద్ద అనంతపురం– తాడిపత్రి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును 120 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు గుర్తించారు. కారును శ్రీధర్‌రెడ్డి నడపగా, ముందు భాగంలో వినయ్‌కుమార్, మధ్య సీట్లలో హరిత, నవనీత కూర్చున్నారు. ముందుభాగంలోని ఎయిర్ బ్యాగ్‌లు ఓపెన్ కావడంతో వినయ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. మధ్యలోని ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఓపెన్ అయినా ఎడమవైపు డోరు తెరచుకోవడం, కారు నుంచి హరిత కింద పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. తలకు బలమైన గాయాలైన నవనీతను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు, ఫోన్ రికార్డులను పరిశీలిస్తున్నారు.
‘కౌశలం’ను సద్వినియోగం చేసుకోండి
అనంతపురం అర్బన్: కౌశలం ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో పిలుపు అందుకున్న యువత ఈనెల 18న జరగనున్న ఇంటర్వ్యూకి హాజరై సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో ఐటీఐ, డిప్లోమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. కౌశలం అసెస్మెంట్ పరీక్షను సంబంధిత స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల్లో పూర్తి చేసి ప్లేస్‌మెంట్ కాల్ అందుకున్న అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. అర్హులైన వారికి ఇప్పటికే సమాచారం అందించారన్నారు.
ఉద్యోగ వివరాలిలా..
ఉద్యోగం: ల్యాప్‌టాప్ అసెంబ్లింగ్, ప్రొడెక్షన్ అసోసియేట్
కంపెనీ: ఏవీఎస్‌ఏఆర్ హెచ్‌ఆర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
పని ప్రదేశం: శిక్షణ డిగ్జాన్–పాడ్‌జెట్ ఎలక్ట్రానిక్స్, కాంచీపురం, తమిళనాడు
వేతనం: రూ.2.18 లక్షల నుంచి రూ.2.30 లక్షలు (ఏడాదికి)


