ఆశలు.. అడియాసలు | - | Sakshi
Sakshi News home page

ఆశలు.. అడియాసలు

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

గుంతకల్లు రూరల్‌: రెండు నెలలు గడుస్తున్నా చినుకు నేల రాలకపోవడం, మండే ఎండలు వెరసి సాగు చేసిన పంటలు క్రమంగా ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామానికి చెందిన సింగరాయ సుంకన్న అనే రైతు బుధవారం తన పొలంలో సాగు చేసిన వేరుశనగ పంటను దున్నేశాడు. రెండు నెలల క్రితం రూ.1.12 లక్షల వ్యయంతో బయటి మార్కెట్‌లో 8 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కొనుగోలు చేసి బోరు కింద ఐదెకరాల్లో పంట సాగు చేపట్టాడు. ఎరువులు, క్రిమి సంహారక మందులు తదితర వాటి కోసం అదనంగా మరో రూ.30 వేలు ఖర్చు చేశాడు. పంట సాగు చేపట్టిన నాటి నుంచి చినుకు జాడ లేకపోవడం, మండే ఎండలు తోడవడంతో భూగర్భ జలాలు తగ్గి ఉన్న రెండు బోర్లలోనూ నీరు ఇంకిపోయింది. దీంతో సాగు చేసిన పంట క్రమంగా ఎండిపోతోంది. వర్షం కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూసిన రైతు సుంకన్న విసిగిపోయి చివరకు బుధవారం పంటను తొలగించాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అప్పు చేసి మరీ సాగు చేపడితే చివరకు ఏమీ మిగల్లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతులు అతలాకుతలమవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు.

రైలు పట్టాలపై ఫిష్‌ప్లేట్‌ ఉంచిందెవరు?

తాడిపత్రి రూరల్‌: రైల్వేట్రాక్‌పై అనుమానాస్పదంగా ఫిష్‌ప్లేట్‌ కనిపించిన ఘటనపై పోలీసు కేసు నమోదైంది. అప్‌గ్రెడ్‌ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని బుగ్గ గ్రామం నుంచి జూటూరు వరకు గూడ్స్‌ ద్వారా ముడి సరుకుల రవాణా కోసం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ రైల్వేలైన్‌ వేయించింది. ఈ నెల 14న సాయంత్రం ముడి సరుకుతో ఫ్యాక్టరీ నుంచి గూడ్స్‌ రైలు వెళుతుండగా, పట్టాలపై ఫిష్‌ప్లేట్‌ (రైల్వే ట్రాక్‌లో రెండు పట్టాల చివరలను కలపడానికి, బిగించడానికి ఉపయోగించేది) కనిపించింది. లోకోపైలట్‌ అప్రమత్తమై అత్యవసర బ్రేకులు వేసినా గూడ్స్‌ బండి ఫిష్‌ప్లేట్‌ను ఢీకొని 10 మీటర్ల వరకు లాక్కెళ్లింది. ఘటనపై అప్‌గ్రెడ్‌ పోలీసుస్టేషన్‌లో అల్ట్రాటెక్‌ కంపెనీ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ రామక్రిష్ణారావు ఫిర్యాదు చేశారు. ఫిష్‌ప్లేట్‌ను ఎవరైనా కావాలనే ఉంచారా..? అనే కోణంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

వివాహిత అనుమానాస్పద మృతి

డి.హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌): మండలంలోని మురడి గ్రామంలో సంధ్య (22) అనే వివాహిత బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన మేరకు.. శెట్టూరు మండలం మంగంపల్లికి చెందిన సంధ్యకు మురడి గ్రామానికి చెందిన తిప్పేస్వామితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. బుధవారం రాత్రి సంధ్య ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే భర్త తిప్పేస్వామి, అత్తామామలు, బంధువులు, స్థానికుల సహకారంతో ఆమెను రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement