సంక్షేమ పథకాలన్నీ టీడీపీ వారికేనా? | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలన్నీ టీడీపీ వారికేనా?

Sep 17 2026 12:20 AM | Updated on Sep 17 2026 12:20 AM

‘దిశ’ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ నిలదీత

అనంతపురం న్యూటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అధికార టీడీపీ వారికి మాత్రమే అమలు చేయడమేంటని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ నిలదీశారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని ఆమె డిమాండ్‌ చేశారు. జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ హాలులో బుధవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ‘దిశ’ కార్యదర్శి కలెక్టర్‌ ఆనంద్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, సీఈఓ విజయలక్ష్మి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ గ్రామస్థాయిలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కేవలం టీడీపీ వారికే అన్న భావనకు తావిస్తోందన్నారు. ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని అధికారులకు హితవు చెప్పారు. కొత్త పింఛన్ల మంజూరు అధికార పార్టీ వారికే ఉంటుందని ప్రకటించడం సమంజసం కాదన్నారు. అలవికాని నిబంధనలతో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఒంటరి మహిళ, దివ్యాంగుల ఎంపికలో అమలు చేస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉందని ఆమె సభ దృష్టికి తెచ్చారు. ఎల్‌–నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రోత్సాహకాలు లేకపోవడంతో డ్వాక్రా రుణాలు తీసుకోవడానికి మహిళలు సుముఖంగా లేరన్నారు.

తోటలను ఎలా కాపాడుతారు?

దిశ కమిటీ చైర్మన్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎల్‌–నినో పరిస్థితుల నేపథ్యంలో ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడటానికి ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయా అంటూ హార్టికల్చర్‌ అధికారిని ప్రశ్నించారు. ఏదో సమాధానం చెప్పబోతుంటే.. దిశ కార్యదర్శి, కలెక్టర్‌ జోక్యం చేసుకున్నారు. ‘కాలువ నీటితో చెరువులను నింపితే భూగర్భ జలం పెరిగి.. బోరు బావుల్లో నీరు వస్తుందం’టూ సమాధానం చెప్పకుండా వినూత్నంగా మీరు ఏమైనా తోటలు ఎండిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారా అని సూటిగా ప్రశ్న సంధించారు. చర్యలు తీసుకోవాల్సిన ఉన్నత స్థాయి అధికారి, ప్రజాప్రతినిధి ఈ విధమైన ప్రశ్నలు రావడంతో ఉద్యాన శాఖ అధికారి మౌనం దాల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement