‘తల్లి’డిల్లిన హృదయాలు | - | Sakshi
Sakshi News home page

‘తల్లి’డిల్లిన హృదయాలు

Sep 16 2026 3:43 AM | Updated on Sep 16 2026 3:43 AM

బుక్కరాయసముద్రం/తాడిమర్రి:అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వారి జీవితం ఆనందంగా సాగిపోవాలని ఆకాంక్షించారు. అలాంటి ‘ఆశల దీపాలు’ ఒక్కసారిగా ఆరిపోయాయని తెలుసుకున్న ఆ హృదయాలు ‘తల్లి’డిల్లిపోయాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బిడ్డలు కళ్ల ముందే విగతజీవులుగా పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయాయి. గుండెలవిసేలా రోదించాయి. వారి ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద అనంతపురం–తాడిపత్రి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కన్నవాళ్లకు తీరని శోకం మిగిల్చింది.

ఇద్దరూ నర్సులే

గుత్తి మండలానికి చెందిన రామాంజనేయులు, సాలమ్మల కుమార్తె హరిత (20) అనంతపురంలోని ఓ నర్సింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుకుంటూ త్రిపుర ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఇదే ఆస్పత్రిలో తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన నారాయణస్వామి, విజయ దంపతుల కుమార్తె నవనీత (20) కూడా నర్సుగా పని చేస్తోంది. వీరివురూ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నారు. త్రిపుర ఆసుపత్రిలోనే ల్యాబ్‌లో పనిచేసే వినయ్‌ కుమార్‌, ఆస్పత్రిలోని ఇన్సూరెన్స్‌ విభాగంలో పనిచేసే శ్రీధర్‌ రెడ్డిలు హరిత, నవనీతతో స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గరయ్యారు. సోమవారం రాత్రి టాటా సఫారీ వాహనంలో శింగనమలకు వచ్చిన నలుగురూ తిరిగి మంగళవారం తెల్లవారుజామున అనంతపురానికి బయలు దేరారు. కారు నడుపుతున్న శ్రీధర్‌ రెడ్డి మార్గమధ్యంలోని రోటరీపురం గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్‌పై స్పీడ్‌ బ్రేకర్లను గమనించకుండా అతివేగంగా వెళ్లడంతో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కల చెట్లను ఢీకొన్న అనంతరం ఓ హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన హరిత అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న బీకేఎస్‌ సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన నవనీత, శ్రీధర్‌ రెడ్డి, వినయ్‌ కుమార్‌ను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నవనీత మృతి చెందింది.

మా బిడ్డలను చంపేశారు..

ప్రమాద వార్త తెలుసుకున్న హరిత, నవనీత తల్లులు విజయ, సాలమ్మతో పాటు వారి బంధువులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. విగతజీవులుగా పడి ఉన్న కుమార్తెల మృతదేహాల వద్ద గుండెల విసేలా రోదించారు. తమ బిడ్డలకు శ్రీధర్‌ రెడ్డి, వినయ్‌కుమార్‌లు మాయ మాటలు చెప్పి హాస్టల్‌ నుంచి బయటకు తీసుకెళ్లి చంపేశారని ఆరోపించారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఘటనపై బీకేఎస్‌ సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆసుపత్రిలో రోదిస్తున్న యువతుల తల్లులు

భీతావహంగా మారిన ఘటనాస్థలి, చిత్రంలో హరిత మృతదేహం

నిడిగల్లులో విషాదం

నవనీత మృతితో తాడిమర్రి మండలంలోని నిడిగల్లులో విషాదఛాయలు అలముకున్నాయి. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న కుమార్తె మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి పోయారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు మదమంచి మల్లికార్జున నాయుడు, గుజ్జల హనుమంతులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరు నర్సుల దుర్మరణం

అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డల మృతితో హతాశయులైన కన్నవారు

మృతదేహాల వద్ద

కన్నీరు మున్నీరైన తల్లులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement