‘ట్రెల్లీస్‌’ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘ట్రెల్లీస్‌’ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Sep 16 2026 3:37 AM | Updated on Sep 16 2026 3:37 AM

అనంతపురం అర్బన్‌: నగరంలోని ‘ట్రెల్లీస్‌’ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత బాలిక తల్లి డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ ఆనంద్‌ను కలిసి వినతి పత్రం సమర్పించేందుకు మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. పోక్సో కేసు వివరాలను బయటపెట్టిన యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించిన నలుగురు విలేకరులపైనా విచారణ చేయాలన్నారు. డీఈఓ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పాఠశాలను తక్షణమే సీజ్‌ చేయాలని కోరారు.

సీజ్‌ చేయాల్సిందే..

సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకున్న ట్రెల్లీస్‌ పాఠశాలను తక్షణమే సీజ్‌ చేయాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ను మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాలుగు రోజులైనా డీఈఓ కమిటీ ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికై నా పాఠశాలను సీజ్‌ చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వీరేంద్ర, బండారు శంకర్‌, మంత్రి సుదర్శన్‌, ప్రతిభ భారతి, చంద్రచర్ల హరి, కొడవండ్ల నరేష్‌, రమణకుమార్‌, ఎంఎండీ ఇమామ్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

రేపు అర్చకుల గ్రీవెన్స్‌

అనంతపురం కల్చరల్‌: జిల్లా దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17న అర్చక స్వాముల గ్రీవెన్సు నిర్వహిస్తున్నట్లు ఎండోమెంటు అధికారిణి బి.సుధారాణి తెలిపారు. స్థానిక మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండరామాలయం వేదికగా ఉదయం 10.30 గంటల నుంచి జరిగే గ్రీవెన్సులో అర్చకులు పాల్గొనాలన్నారు.

● అర్చకులకు అనేక సమస్యలున్నాయని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని దేవాలయాల అర్చకులు తరలి రావాలని ఏపీ అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పులమాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

యథేచ్ఛగా చెరువు మట్టి దోపిడీ

శెట్టూరు: మండల కేంద్రంలోని చెరువు నుంచి రెండు రోజులుగా వందలాది ట్రాక్టర్ల మట్టిని యథేచ్ఛగా ఓ వ్యక్తి తరలిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకోకపోవడం గమనార్హం. స్థానికులు ప్రశ్నిస్తే ‘నా ఇష్టం.. నాకు పలుకుబడి ఉంది.. నన్నెవరూ అడ్డుకోలేరు’ అంటూ రుబాబు చేస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రం నుంచి వలస వచ్చిన సదరు వ్యక్తి స్థానిక వనరులను కొల్లగొడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే మట్టి తవ్వుతున్నారని స్థానికులు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆరోపించారు. మండల వ్యాప్తంగా పలుచోట్ల యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు పోతున్నారని స్థానికులు వాపోయారు. మండల కేంద్రంలోని చెరువులో సాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై ఎమ్మార్పీఎస్‌ నాయకులు తహసీల్దార్‌ ఈశ్వరమ్మకు ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వన్నూరుస్వామి, మండల అధ్యక్షుడు గౌరయ్య, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement