జొన్నల పంపిణీకి చర్యలు | - | Sakshi
Sakshi News home page

జొన్నల పంపిణీకి చర్యలు

Sep 16 2026 3:43 AM | Updated on Sep 16 2026 3:43 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ప్రత్యామ్నాయ విత్తనాల కింద జొన్నలు పంపిణీ చేయడానికి వీలుగా జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ నేతృత్వంలో మంగళవారం కలెక్టరేట్‌ మినీకాన్ఫరెన్స్‌ హాలులో పర్చేజ్‌ కమిటీ సమావేశమై చర్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీడ్స్‌ ద్వారా ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ జరుగుతున్నా.. జాబితాలో జొన్నలు లేనందున... జిల్లా స్థాయిలోనే విత్తనాల ధరలు నిర్ణయించే అంశంపై సమావేశం నిర్వహించారు. జొన్నలతో పాటు సజ్జలు కూడా 80 శాతం రాయితీతో రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీంతో వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌, శాస్త్రవేత్తలతో పాటు పలు విత్తన కంపెనీలతో ధరల ఖరారుపై సమాలోచనలు చేశారు. విత్తన జొన్నలు కిలో రూ.220 ప్రకారం, సజ్జలు కంపెనీలను బట్టి రూ.250 నుంచి 300 వరకు ప్రతిపాదించారు. కమిటీలో ప్రతిపాదించిన ధరలను కమిషనరేట్‌కు పంపి అనుమతులు రాగానే 80 శాతం రాయితీతో పంపిణీకి చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

బైక్‌ రేసింగ్‌లో తాడిపత్రి యువకుడి సత్తా

తాడిపత్రిటౌన్‌: ఈ నెల 12, 13 తేదీల్లో జరిగిన జాతీయస్థాయి బైక్‌ రేసింగ్‌ పోటీల్లో తాడిపత్రి యువకుడు హర్ష సత్తా చాటి ద్వితీయస్థానంలో నిలిచాడు. గన్నెవారిపల్లి కాలనీకి చెందిన గోపాల్‌, వరలక్ష్మి దంపతుల కుమారుడైన హర్ష తాడిపత్రిలోని సాయి విజేత స్కూల్‌లో పదవ తరగతి వరకు చదివి, ఇంటర్‌ విజయవాడలోని శ్రీచైతన్యలో పూర్తి చేశాడు. 2022లో బెంగళూరులో బీటెక్‌ చదువుతూనే 2024 నుంచి చైన్నెలోని ఆర్‌ఏసీఆర్‌లో బైక్‌ రేసింగ్‌ శిక్షణ పొందాడు. జాతీయ స్థాయిలో బైక్‌ రేసింగ్‌లో ప్రతిభ కనబరిచిన హర్షను తల్లిదండ్రులతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు.

పేలుడు సామగ్రి స్వాధీనం

పెద్దవడుగూరు : పేలుడు సామగ్రిని నిల్వ ఉంచి అక్రమంగా విక్రయిస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 2,500 డిటోనేటర్లు పట్టుబడినట్లు ఎస్‌ఐ రాఘవేంద్రప్ప తెలిపారు. కొండుపల్లి చుట్టూ నిర్వహిస్తున్న మైనింగ్‌ గనుల్లో యజమానులు అనుమతులతో కూడిన అనుభవజ్ఞులతో పేలుళ్లు జరపడానికి డిటోనేటర్లను వినియోస్తున్నారు. అయితే కొండుపల్లికి చెందిన రంగస్వామి, యాడికి మండలానికి చెందిన బ్లాస్టర్‌ రాంభూపాల్‌రెడ్డి అనే వ్యక్తులు అక్రమాలకు తెగబడి కొండుపల్లి సమీపంలోని వశీమ్‌రాజా మినరల్స్‌లో పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు మంగళవారం దాడి చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఉమ్మడి ‘స్థానిక’ పోలింగ్‌ కేంద్రాలు 2,741

అనంతపురం న్యూ టౌన్‌: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా పరిషత్‌ ప్రాదేశిక స్థానాల్లో ఓటర్లు తమ ఓట్లను వేసేందుకు పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా జాబితాను జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి వెల్లడించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పోలింగ్‌ కేంద్రాల జాబితాను ప్రజల సమాచార నిమిత్తం జిల్లా పరిషత్‌ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 63 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాల పరిధిలో 2,741 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినట్లు వివరించారు. అనంతపురం జిల్లాలోని 31 మండలాలకు గాను 1,507 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అదేవిధంగా శ్రీసత్యసాయి జిల్లాలోని 32 జిల్లాపరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాల్లో 1,234 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ మొత్తం 2,741 పోలింగ్‌ స్టేషన్ల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25,18,110 మంది ఓటర్లు 63 మంది జిల్లా ప్రాదేశిక సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement