క్షుద్రపూజల కలకలం | - | Sakshi
Sakshi News home page

క్షుద్రపూజల కలకలం

Sep 16 2026 3:37 AM | Updated on Sep 16 2026 3:37 AM

కళ్యాణదుర్గం: పట్టణంలోని స్థానిక మారెంపల్లి కాలనీ వాసులకు ఆరాధ్యదైవంగా ఉన్న తాటిమాను మారెమ్మ ఆలయం వద్ద వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు స్థానికులు, భక్తుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆలయంలో జరిగిన దొంగతనం, అమ్మవారి చేయి ధ్వంసం కాగా, ఇటీవల ఆలయ ప్రాంగణంలో క్షుద్రపూజలు వెలుగుచూడటం కాలనీవాసులను ఉలిక్కి పడేలా చేస్తోంది.

విగ్రహం ధ్వంసం...ఆభరణాల చోరీ

కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి అమ్మవారి చేయిని విరగ్గొట్టారు. విగ్రహంపైన ఉన్న వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన నుంచి భక్తులు తేరుకోకముందే నాలుగు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం వెనుక భాగంలో క్షుద్రపూజలు నిర్వహిస్తుండటాన్ని కాలనీ వాసులు గుర్తించారు. పూజా సామగ్రి, ఇతర ఆనవాళ్లు నిత్యం దర్శనమిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

20 మందికి పైగా కాపలా ఉన్నా..

క్షుద్రపూజలు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకునేందుకు కాలనీ వాసులు, భక్తులు, ఆలయ పూజారులు నాలుగు రోజుల క్రితం రాత్రి సమయంలో సుమారు 20 మందికిపైగా ఆలయ ఆవరణంలో కాపలాగా ఉన్నారు. అయితే ఆగంతకులు అదే రాత్రి క్షుద్రపూజలు ముగించుకుని వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉదయం నిద్రలేచి చూసిన భక్తులు పూజల ఆనవాళ్లు, వాడిన పూజా సామగ్రిని చూసి భయాందోళన చెందుతున్నారు.

పీఠాధిపతులను ఆశ్రయించిన కాలనీ వాసులు

మారెమ్మ ఆలయంలో జరుగుతున్న వరుస పరిణామాలతో తీవ్ర భయాందోళనకు గురైన కాలనీ పెద్దలు, భక్తులు, ఆలయ నిర్వాహకులు ఇటీవల పలు ప్రముఖ పీఠాధిపతులను కలిసి ఆలయంలో జరిగిన చోరీలు, క్షుద్రపూజలపై వివరించినట్లు సమాచారం. చేపట్టాల్సిన శాంతి పూజలు, దోష నివారణ చర్యలపై సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు క్షుద్రపూజల నేపథ్యంలో పోలీసులు రాత్రి సమయాల్లో గస్తీ చేపట్టి దుండగులను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement