● వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్
అనంతపురం: ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని వారిపై నిఘా ఉంచడం అప్రజాస్వామిక చర్య అని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు అన్నారు. ఆ హక్కును వినియోగించుకుంటున్న విద్యార్థులు, నిరుద్యోగులను నేరస్తులుగా చిత్రీకరించడం భావ్యం కాదన్నారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, సైబర్ విభాగాల పేరుతో నిరుద్యోగ యువతకు సంబంధించిన డిజిటల్ నెట్‌వర్క్‌లను మ్యాపింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. నిరుద్యోగులు చురుగ్గా ఉండే వాట్సాప్ గ్రూపులు, అడ్మిన్ల వివరాలు, సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనల్లో పాల్గొన్న వారి ఫొటోలు, వీడియోలతో రికార్డులు తయారు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మార్గదర్శకత్వం వహించే కోచింగ్ సెంటర్లు, అధ్యాపకులు, యూట్యూబర్లపై తనిఖీల పేరుతో ఒత్తిడి తీసుకువస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను రాజకీయ స్వప్రయోజనాలు, నిరుద్యోగుల పర్యవేక్షణ కోసం వాడటం అత్యంత విచారకరమని వ్యాఖ్యానించారు. ‘యువత ఫోన్లలోకి తొంగిచూడడం కాదు.. వారి భవిష్యత్తులోకి ప్రభుత్వం చూడాలి. ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు కల్పిస్తారో, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారో, నిరుద్యోగ భృతి హామీ పరిస్థితి ఏమిటో ముఖ్యమంత్రి స్పష్టమైన సమాధానం చెప్పాలి‘ అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.


