హోల్డ్‌లోనే ‘ఫ్రీహోల్డ్‌’ | - | Sakshi
Sakshi News home page

హోల్డ్‌లోనే ‘ఫ్రీహోల్డ్‌’

Sep 14 2026 3:26 AM | Updated on Sep 14 2026 3:26 AM

అనంతపురం అర్బన్‌: అసైన్డ్‌ భూములు సాగు చేస్తున్న రైతులకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. 2003కు ముందు అసైన్డ్‌ అయిన భూములకు యాజమాన్య హక్కు కల్పించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 563 గ్రామాలకు గాను తొలివిడతగా 114 గ్రామాల్లో ఫ్రీహోల్డ్‌కు సంబంధించి అసైన్డ్‌ భూముల వివరాలు సిద్ధం చేశారు. ప్రభుత్వం మారడం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫ్రీహోల్డ్‌ భూముల ప్రక్రియను పరిశీలన పేరుతో నిలిపివేసింది. ఆ ప్రక్రియ పూర్తయినప్పటికీ యాజమాన్య హక్కులు కల్పించడంపై ఏడాదిగా నాన్చుడు ధోరణి అనుసరిస్తూ వస్తోంది.

అసైన్డ్‌ భూములు 3.03 లక్షల ఎకరాలు

జిల్లావ్యాప్తంగా 563 రెవెన్యూ గ్రామాల్లో 2003కు ముందు 96 వేల మంది రైతులకు అసైన్డ్‌ చేసిన భూములు 3,03,370.55 ఎకరాలు. ఇందులో 1954, జూన్‌ 18 ముందు వాటిని, 22ఏ జాబితా, చుక్కల భూముల జాబితాలో ఉన్న వాటికి కాకుండా మిగిలిన అసైన్డ్‌ భూములు ఫ్రీహోల్డ్‌ చేసి యాజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు.

ఫ్రీహోల్డ్‌కు 36వేల ఎకరాలు సిద్ధం

జిల్లాలో 563 గ్రామాలకు సంబంధించి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 114 గ్రామాల్లో అసైన్డ్‌ భూములు ఫ్రీహోల్డ్‌ ప్రక్రియ నిర్వహించి 36,659 ఎకరాలను ఫ్రీహోల్డ్‌కు సిద్ధం చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. భూములను ఫ్రీ హోల్డ్‌ చేసి యాజమాన్య హక్కు కల్పించే కార్యక్రమాన్ని నిలిపివేసి పరిశీలనకు ఆదేశించింది. దీంతో తహసీల్దారు స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి వరకు మరోమారు పరిశీలన చేసి 36,659 ఎకరాల్లో 26,132 ఎకరాలు చట్టబద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. గుర్తించిన 26 వేల ఎకరాల భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో ఎటూ తేల్చకుండా సాగదీస్తూ వస్తోంది. ఇక ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ రిజిస్ట్రేషన్‌శాఖకు ఉత్తర్వులు ఉండడంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. చివరికి అసైనీదారు చనిపోతే వారసులు మ్యుటేషన్‌ కూడా చేసుకోలేని పరిస్థితి.

ఊరిస్తూ.. దాటవేస్తూ..

ఫ్రీహోల్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తోంది. ఫ్రీహోల్‌ భూములకు మోక్షం కల్పిస్తున్నాం అదిగో... ఇదిగో అంటూ ఏడాదిగా రైతులను ఊరిస్తూ వస్తోంది. ఇప్పటికీ అదే ధోరణితో ముందుకు పోతోంది. ఫ్రీహోల్‌ భూములకు క్లియరెన్స్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు. తాజాగా మరోసారి ఊరిస్తూ అదే తరహాలో ప్రకటన చేసింది. ఈసారైనా ఫ్రీహోల్డ్‌కు మోక్షం కల్పిస్తుందా..? లేక ఎప్పటిలాగానే సాగదీస్తుందా అనేది వేచిచూడాలి.

ఫ్రీహోల్డ్‌కు సిద్ధం చేసింది 36 వేల ఎకరాలు

చట్టబద్ధంగా ఉన్నట్లు గుర్తించింది 26 వేలు

పరిశీలన పూర్తయినప్పటికీ

వీడని ‘చంద్ర’గ్రహణం

యాజమాన్య హక్కులు కల్పించడంలో సర్కారు నాన్చుడు ధోరణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement