● మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
నల్లచెరువు: మండల కేంద్రంలోని విజయలక్ష్మి కాలనీలో నివాసముంటున్న వివాహిత రుబీనా (27) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు... విజయలక్ష్మి కాలనీలో ఆటోడ్రైవర్ మన్సూర్, రుబీనా దంపతులు నివాసముంటున్నారు. వారికి కుమారుడు రియాన్, కుమార్తె ఫైజ ఉన్నారు. అయితే చిన్న పిల్లలు అల్లరి చేస్తున్నారని వారిని రుబీనా మందలించింది. ఈ విషయంపై దంపతుల మధ్య ఆదివారం చిన్నపాటి గొడవ జరిగింది. భర్త మన్సూర్ ఇంటి వరండాలో పిల్లలతో కలిసి ఉండగా గొడవ కారణంగా మనస్తాపం చెందిన రుబీనా ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసి లోపల గడి పెట్టుకుంది. ఇంట్లో నుంచి గట్టిగా కేకలు వినపడడంతో వెంటనే మన్సూర్ ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని రుబీనా మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మక్బూల్ బాషా తెలిపారు.
సమస్య పరిష్కరించడం లేదని
రైతు ఆత్మహత్యాయత్నం
పెద్దపప్పూరు: ప్రభుత్వం తనకు ఇచ్చిన ఇంటి స్థలాన్ని మరొకరు కబ్జా చేస్తున్నారు. న్యాయం చేయాలని అధికారులను బతిమలాడినా పట్టించుకోలేదంటూ ఓ రైతు మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. మండలంలోని శింగనగుట్టపల్లికి చెందిన రామాంజినేయులు శనివారం రెవిన్యూ, పోలీస్ అధికారుల వద్దకు వెళ్లాడు. తన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలగొగ్గిన ఆర్‌ఐ ఉదయ్‌కుమార్ తన ఇంటికి వచ్చి ఇతరులు ఆ స్థలంపై అభ్యంతరాలు తెలిపారని, ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన రామాంజినేయలు తనకు న్యాయం జరగదని భావించి ఆదివారం తన పొలంలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన ఆత్మహత్యకు ఆర్‌ఐ ఉదయ్‌కుమార్, అదే గ్రామానికి చెందిన ఒబన్నగారి నాగరాజు, చెత్తప్పగారి వీరయ్య, ఉల్లికల్లు వీరయ్య, పుల్లారెడ్డి కారణమని, వారికి న్యాయస్థానం తగిన శిక్షవేయాలంటూ పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న ఆయన్ను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసి మృతి
గార్లదిన్నె: మండల పరిధిలోని కల్లూరు పెన్నానది బ్రిడ్జి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు మృతి చెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు.. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన నలుగురు యువకులు, బెంగళూరు నుంచి జీప్‌లో మంత్రాలయానికి బయలుదేరారు. అయితే కల్లూరు వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని జీప్ ఢీకొంది. దీంతో జీప్‌లోని అభిలాష్ (23) అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నపరెడ్డి, రేవంత్‌కుమార్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు.


