ఐచర్‌ ఢీకొని ఇంటర్‌ విద్యార్థిని దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఐచర్‌ ఢీకొని ఇంటర్‌ విద్యార్థిని దుర్మరణం

Sep 14 2026 3:26 AM | Updated on Sep 14 2026 3:26 AM

యాడికి: రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన గుత్తి – తాడిపత్రి జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు... పెద్దవడుగూరు మండలం భీమునిపల్లికి చెందిన కంబగిరి రాముడు, రాజేశ్వరి దంపతులు వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె వనజ (16) ఉన్నారు. దినసరి కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వనజ తాడిపత్రిలోని కేజీబీవీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే గత వారం రోజులుగా వనజ అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కుమార్తెను ఇంటికి తీసుకొచ్చి తాడిపత్రిలోని ఓ ఆస్పత్రిలో చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం కూడా ఆస్పత్రిలో వనజను చెక్‌ చేయించి తల్లిదంద్రలతో పాటు ఆమె కూడా ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలు దేరారు. యాడికి మండలంలోని గుత్తి – తాడిపత్రి జాతీయ రహదారిపై పెండేకల్లు సమీపంలో ఐచర్‌ వాహనం వేగంగా వస్తుండటంతో బైక్‌పై నుంచే తన తండ్రికి విషయాన్ని చెప్పింది. ఆయన వాహనాన్ని ఆపాడు. అయితే ఐచర్‌ (జీజే27టీజీ1290) వాహనం ఎక్కడ ఢీ కొంటుందోనని హైవేపై పరుగెత్తే ప్రయత్నం చేయగా వనజను ఐచర్‌ ఢీ కొంది. ఈ ఘటనలో విద్యార్థిని అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఘటన తర్వాత వాహనాన్ని అక్కడే వదిలి డ్రైవర్‌ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

స్థలం కబ్జా చేశారు.. న్యాయం చేయండయ్యా..

పామిడి: గుత్తి ఆర్‌ఎస్‌లోని తమ మూడుసెంట్ల ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని, న్యాయం చేకూర్చాలని పామిడికి చెందిన పేద దళిత దంపతులు పీ రజని, వరప్రాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వారి వివరాలమేరకు.. గుత్తి ఆర్‌ఎస్‌లోని చెట్నేపల్లి పరిధిలోని సర్వేనంబర్‌ 208–ఏ1 లోని ప్లాట్‌ నంబర్‌ 41లోని మూడు సెంట్ల స్థలాన్ని 40 ఏళ్ల క్రితం తమ జేజమ్మ రమణమ్మకు ప్రభుత్వం పట్టా కేటాయించిందన్నారు. ఆమె తదనంతరం తన భర్త వరప్రసాద్‌ నుంచి ఆ మూడుసెంట్ల స్థలాన్ని రజని పేర పట్టా పొందానన్నారు. అయితే గుత్తి ఆర్‌ఎస్‌లోని ఆ స్థలాన్ని పక్కనే ఉన్న ఆదినారాయణ కుటుంబం ఆక్రమించుకొని ప్రహరీ నిర్మించారన్నారు. ప్రశ్నించిన తమపై ఆదినారాయణతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలసి కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారన్నారు. రజనీ గాయపడగా గుత్తి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినట్లు పేర్కొన్నారు. దీనిపై గుత్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా సంబంధితా పోలీసు ఉన్నతాఽధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని దళిత దంపతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement