అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయం, రైతుల పరిస్థితులు అధ్వానంగా ఉన్నందున చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పశువుల మార్కెట్‌ను సీపీఐ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పంటలు లేక, పశుగ్రాసం లేక పాడి ఆవులు, గేదెలను అయినకాటికి అమ్ముకుంటున్నట్లు పలువురు రైతులు వాపోయారు. ఈ సందర్భంగా కె.రామకృష్ణ మాట్లాడుతూ... ఎల్‌నినో తీవ్రంగా ఉన్నందున జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష వైఖరికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
రాప్తాడు రూరల్: రాయలసీమ జిల్లాల్లో కరువు పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ ధ్వజమెత్తారు. కరువు ప్రభావంతో పంటలు ఎండిపోవడం, సాగునీరు అందకపోవడం, పశుగ్రాసం కొరత ఏర్పడటంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సీపీఐ, రైతు సంఘాల ప్రతినిధి బృందం అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామం వద్ద ఎండిపోయిన దానిమ్మ తోటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్


