గుత్తి రూరల్: మండలంలోని గాజులపల్లిలో ఎండిన వేరుశనగ పంటలను రైతులు తొలగిస్తున్నారు. ఆదివారం గ్రామంలోని సుమారు 25 మంది రైతులు తమ పంటలను తొలగించారు. సాధారణంగా సెప్టెంబర్ మాసంలో తోటలన్నీ పచ్చదనంతో కళకళలాడాల్సింది. అయితే ఎల్‌నినో ప్రభావంతో మొక్కల్లో ఎదుగుదల లేక ఎండి పోతున్నాయి. కనీసం పశువులకు మేతైనా లభిస్తుందని గ్రామంలోని రైతులు వేరుశనగ పంటలు తొలగిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతు హనుమంతురెడ్డి మాట్లాడుతూ వేరుశనగ మొక్కలు ఎండిపోయి ఏ మాత్రం కాపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట దిగుబడి రాక పెట్టుబడి సుమారు రూ.4 లక్షలు నష్టపోయానని వాపోయారు. పంట తొలగింపునకు అదనంగా కూలీ ఖర్చులు వచ్చాయన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


