కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం)లో నీటి మట్టం 3 టీఎంసీలు దాటింది. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీటి లభ్యత బాగా తగ్గిపోతోంది. తాగునీటి సమస్య తలెత్తే పరిస్థితి ఉంది. పీఏబీఆర్ డ్యాంలో ఏర్పాటైన సత్యసాయి, శ్రీరామిరెడ్డి, అనంత , ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేలాది గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రజల తాగునీటి అవసరాల దృష్ట్యా పీఏబీఆర్ డ్యాంలోకి తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీ కెనాల్ ద్వారా 150 , జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువ ద్వారా 450 క్యూసెక్కులు చొప్పున నీరు సరఫరా అవుతోంది. తాగునీటి ప్రాజెక్టులకు రోజూ 55 క్యూసెక్కులు, నీటి ఆవరి , లీకేజీల రూపంలో మరో 55 క్యూసెక్కుల నీరు బయటకు వెళుతోంది. అవుట్ ఫ్లో కంటే ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో డ్యాంలో నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. ఆదివారం నాటికి డ్యాంలో 3.512 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్ అధికారులు తెలిపారు.


