గార్లదిన్నె: పంటలు పండక, రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వం, వ్యవసాయశాఖాధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మర్తాడులో వర్షాలు లేక ఎండిపోయిన చీనీ, వేరుశనగ పంట పొలాలను రాంభూపాల్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం తక్షణ సాయం కింద పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టాల్లో ఉన్నా ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కరువుపై ఈనెల 20, 21, 23 తేదీల్లో సీపీఎం ఆధ్వర్యంలో బృందాలు పర్యటిస్తాయన్నారు.


