అనంతపురం సిటీ: ఎయిడ్స్ నియంత్రణలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించినందుకు గాను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు ప్రతిష్టాత్మకమైన సక్షం (ఎస్‌ఏకేఎస్‌హెచ్‌ఏఎం) అవార్డు దక్కింది. ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించి యూనిటైడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ (యుఎన్‌ఏఐడీఎస్) సంస్థ 2030 నాటికి 95–95–95 లక్ష్యాలను సాధించాలని సభ్య దేశాలకు దిశానిర్దేశం చేసింది. ఇందులో మొదటి 95లో భాగంగా జిల్లాలో హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందిని గుర్తించడం, రెండో భాగంలో వారికి వంద శాతం సంపూర్ణ చికిత్స అందించడం, మూడో భాగంలో చికిత్స పొందిన వారిలో వంద శాతం వ్యాధిని అణిచివేయడం లక్ష్యాలు కాగా, వీటిని సాధించిన జిల్లాలకు ప్రగతి ఆధారంగా సంఘర్షశీల్, సక్షం, సురక్షిత్, సురక్షిత ప్లస్‌గా విభజించి అవార్డులను ప్రకటించారు. ఈ ప్రగతి ఆధారంగా సంఘర్షశీల్ స్థితి నుంచి సక్షం స్థితికి చేరిన జిల్లా వైద్యాధికారులను అభినందిస్తూ ఈ నెల 8న విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సక్షం అవార్డును ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్‌రాజ్ ప్రదానం చేశారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లును జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ జయలక్ష్మి, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ వెంకటరత్నం, సీపీఓ రమణ కలసి అవార్డును అందజేశారు.
వివాహిత ఆత్మహత్య
శింగనమల: మండలంలోనివె వెస్ట్ నరసాపురం గ్రామంలో ఓ వివాహిత శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ ప్రసాద్ తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన మల్లేశ్వరి(26)కి నార్పల మండలం బొందలవాడకు చెందిన నాగేంద్రతో ఒకటిన్నర సంవత్సరం క్రితం వివాహం జరిగింది. నెలరోజులకే భర్తతో ఉండడం ఇష్టం లేక మల్లేశ్వరి స్వగ్రామం వచ్చేసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాశీపురంలో వృద్ధురాలు..
రాయదుర్గం రూరల్: అనారోగ్యం బారిన పడిన హరిజన లక్ష్మక్క (78) అనే వృద్ధురాలు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన మండలంలోని కాశీపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన మేరకు లేట్ హరిజన గంగన్న భార్య లక్ష్మక్క ఒక్కగానొక్క కుమారుడితో ఉంటోంది. గురువారం రోజు వ్యవసాయ కూలి పనులకు కూడా వెళ్లి వచ్చింది. అయితే రాత్రి అనారోగ్యానికి గురైన ఆమె బాధను భరించలేక, కుమారుడు, కోడలికి చెప్పుకోలేక, శుక్రవారం ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.


