తాడిపత్రి రూరల్: మండలంలోని బ్రహ్మణపల్లి వద్ద వ్యవసాయ పొలంలో విద్యుత్ షాక్‌కు గురై బాషా (45) అనే వ్యక్తి మృతి చెందాడని అప్‌గ్రెడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. గ్రామంలో సురేష్‌రెడ్డికి చెందిన మోటార్ పనిచేయకపోవడంతో స్టార్టర్‌ను రిపేరీ చేస్తున్న సమయంలో బాషా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడన్నారు. వెంటనే చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఇసుక అక్రమ డంప్ గుట్టు రట్టు
శింగనమల: మండలంలోని సలకంచెరువు వద్ద కూతలేరు వంక నుంచి అక్రమంగా ఇసుకను తరలించి ఒక టీడీపీ నాయకుడు నిల్వ చేసుకున్న డంప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఉల్లికల్లు సమీపంలోని పెన్నానది నుంచి రోజూ టీడీపీ నాయకులు ఇసుక అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కూతలేరు వంక నుంచి ఓ టీడీపీ నాయకుడు ఇసుకను భారీగా తరలిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అధికార అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ‘పచ్చ’ పార్టీ నాయకుల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


