బ్రహ్మసముద్రం: మండల పరిధిలోని గుడిపల్లి గ్రామానికి చెందిన గొర్ల శ్రీనివాసులు (55) అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. శ్రీనివాసులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవలే తనకున్న ఎకరా పొలంలో టమాట పంటను సాగు చేశాడు. అయితే గిట్టుబాటు ధర లేక టమాట మార్కెట్‌లో అమ్ముడు పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మనస్తాపం చెందాడు. ఇందులో భాగంగానే 7న ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం పరిస్థితి విషమించడంతో శ్రీనివాసులు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయికుమార్ తెలిపారు.


