● యూపీఎస్‌సీ ఆధ్వర్యంలో
రెండు కేంద్రాల్లో నిర్వహణ
అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఫ్లాగ్‌షిప్ పరీక్ష ఈనెల 13న జరగనుంది. రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 352 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణపై డీఆర్‌ఓ ఎ.మలోల గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల కేంద్రంగా కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (సీడీఏ) పరీక్ష మూడు సెషన్లుగా జరుగుతుందన్నారు. కేఎస్‌ఎన్ యూజీ, పీజీ మహిళ కళాశాల కేంద్రంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), నావెల్ అకాడమీ (ఎన్‌ఏ) పరీక్ష రెండు సెషన్లుగా జరగుతుందన్నారు. సీడీఏ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు రెండో సెషన్, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడో సెషన్ జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు 155 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. అలాగే ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు 197 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
విద్యార్థుల ఘర్షణ
పెద్దవడుగూరు: గుత్తి పరిధిలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ అనే విద్యార్థికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయాన్ని విద్యార్థులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. విజయ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కళాశాలకు చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. యాజమాన్యంతో చర్చించి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రాఘవేంద్రప్ప తెలిపారు.
టీచర్ సస్పెన్షన్
గార్లదిన్నె: మండల పరిధిలోని మోడల్ స్కూల్లో పీజీటీ ఫిజిక్స్ టీచర్‌గా పని చేస్తున్న నారాయణపై వేటు పడింది. విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఇటీవల కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓ అయూబ్ హుస్సేన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా టీచర్ నారాయణను సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు.
మద్యం షాపులను
రెన్యూవల్ చేసుకోండి
హిందూపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత మద్యం షాపుల లైసెన్సులను మరో సంవత్సరం పాటు రెన్యూవల్ చేసుకోవడానికి అవకాశం కల్పించిందని, అందువల్ల మద్యం షాపుల లైసెన్సుదారులు తమ షాపులను రెన్యూవల్ చేసుకోవాలని అనంతపురం జిల్లా ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్‌కేడీవీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో స్థానిక సీఐ లక్ష్మీదుర్గయ్యతో కలిసి పట్టణంలో మద్యం షాపు లైసెన్సుదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మద్యం షాపుల రెన్యూవల్‌కు సంబంధించి విధి విధానాలను ఆయన వివరించారు. రెన్యూవల్ చేసుకోకపోతే ఆ షాపును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు.


