● క్రీడాకారులకు టీఏ, డీఏల పెంపు : వీసీ జ్యోతికుమార్
అనంతపురం: జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో ఎస్కేయూ ఖ్యాతిని చాటిచెప్పే క్రీడాకారులకు వర్సిటీ యాజమాన్యం భారీ తాయిలాలను ప్రకటించింది. గురువారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వార్షిక క్రీడా మండలి సమావేశం వీసీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడారు. జాతీయ, జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనే ఎస్కేయూ విద్యార్థులు, కోచ్‌లు, మేనేజర్ల టీఏ, డీఏలను ఈ విద్యా సంవత్సరం నుంచి పెంచుతున్నట్లు వివరించారు. 400 మీటర్ల పరుగు పందెంలో జోనల్ స్థాయిలో పతకం సాధిస్తే రూ. 25 వేలు, జాతీయ స్థాయిలో పతకం గెలిస్తే రూ. 50వేలు నగదు పురస్కారాలను అమెరికాలో స్థిరపడిన డాక్టర్ ఆనంద్ ముసునూరి సౌజన్యంతో అందిస్తామన్నారు. వర్సిటీలోని స్టేడియంలో బాస్కెట్‌బాల్ కోర్టు పునరుద్ధరణ, కబడ్డీ, ఖో–ఖో కోర్టులకు ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు క్రీడాకారుల సౌకర్యార్థం ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఖేలో ఇండియా, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌కు ఎంపికై న క్రీడాకారులకు ప్రయాణ ఖర్చులతో కూడిన ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సమావేశంలో వర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ బి. అనిత, ప్రిన్సిపాల్ డి.ఆంజనేయులు, రిజిస్ట్రార్ రమేష్ బాబు, క్రీడా మండలి కార్యదర్శి ఎం.వి. శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
అకాడమిక్ కన్సల్టెంట్ల నియామకం..
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ – సైన్స్ కళాశాలలోని 28 విభాగాల్లో తరగతులు నిరంతరాయంగా సాగేందుకు, విద్యా కార్యకలాపాలను మెరుగు పరిచేందుకు 80 మంది అకాడమిక్ కన్సల్టెంట్లను నియమించారు.
పోస్టర్ల ఆవిష్కరణ..
ఎస్కేయూలోని అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇన్వెస్టర్స్ మీట్–2026 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను గురువారం ఆ వర్సిటీ వీసీ జ్యోతికుమార్ ఆవిష్కరించారు.


