ఆత్మకూరు: గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గురువారం ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలోని హంద్రీ నీవా కెనాల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంతపురం రూరల్ ఇన్‌చార్జ్ డీఎస్సీ చంద్రశేఖర్, ఇటుకులపల్లి సీఐ హేమంత్‌కుమార్ వివరాలు తెలియజేశారు. వాహనాల తనిఖీలో భాగంగా గురువారం కళ్యాణదుర్గం నుంచి రెండు ద్విచక్ర వాహనాల్లో నలుగురు వ్యక్తులు రాగా అనుమానంతో వారిని తనిఖీ చేశామన్నారు. వారి దగ్గర 1.5 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలను, మూడు సెల్‌ఫోన్‌లను స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయి విక్రయిస్తున్న కాకిమాని రాజు, (బళ్లారి టౌన్), నల్లబోతుల సుంకన్న (అనంతపురం), ఎడవాల మహేష్ (అనంతపురం)తో పాటు బాలుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలియజేశారు. మహేష్‌పై ఇప్పటికే రెండు మర్డర్ కేసులు కూడా ఉన్నాయన్నారు. నలుగురిలో ఇద్దరిని కిట్ల ద్వారా పరీక్షించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు, ఇటుకలపల్లి ఎస్‌ఐలు లక్ష్మణరావు, విజయ్‌కుమార్, ఏఎస్‌ఐ దస్తగిరి, గౌస్, కానిస్టేబుళ్లు హరి, విజయ్, చౌడప్ప, అశోక్, హర్ష తదితరులు పాల్గొన్నారు.
1.5 కిలోల గంజాయి స్వాధీనం


