ఉరవకొండ: ఆశలు అడియాసలయ్యాయి. అప్పు చేసి, రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలు మట్టిలోనే కలిసిపోతుంటే రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఉరవకొండ మండలం షేక్షానుపల్లికి చెందిన అయ్యప్పరెడ్డి 7 ఎకరాల్లో వేరుశనగ పంట సాగుచేసి తీవ్ర వర్షాభావంతో బోరు బావుల్లో నీరు లేక పంటను గొర్రెలకు వదిలేశాడు. రూ.3 లక్షలు నష్టపోయినట్లు రైతు వాపోయాడు. అలాగే విడపనకల్లు మండలంలో వందలాది ఎకరాల్లో సాగు చేసిన కంది, మిర్చి పంట 80 రోజులవుతున్నా వర్షాలు రాకపోవడంతో ఎండిపోతున్నాయి. కొంత పంటను దున్నేస్తూ మరికొంత పంటను పశువులకు రైతులు వదిలేస్తున్నారు.


