● హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలి
● మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్
● రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా
అనంతపురం : కరువు కరాళ నృత్యం చేస్తోందని, రైతులను తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఎండిపోయిన వేరుశనగ, కంది మొక్కలను ప్రదర్శిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి రెండు గంటలపాటు మండుటెండలోనే ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ శింగనమల నియోజకవర్గంలోని కాలువల దిగువ ఆయకట్టు ప్రాంతాలకు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, సుబ్బరాయ సాగర్‌కు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని కోరారు. కణేకల్లు చెరువు, హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ ఆయకట్టుకు మాత్రమే నీరు అందిస్తామని ఐఏబీ సమావేశంలో నిర్ణయించారన్నారు. మరి హెచ్చెల్సీ దిగువన ఉన్న ఎంపీఆర్ పరిధిలోని శింగనమల, తాడిపత్రి తదితర నియోజకవర్గాల రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సెప్టెంబర్ మొదటి వారం గడిచినా తగిన వర్షాలు కురవలేదన్నారు. బోర్లు ఎండిపోతున్నాయని, మెట్టభూముల్లో పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ట్యాంకరు నీరు రూ.900 వెచ్చించి పంటలకు పెట్టాల్సి వస్తోందన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పశువులకు నీటి సమస్య అధికమైందన్నారు. ఇంతటి దుర్భర పరిస్థితులు కళ్లకు కనిపిస్తున్నా సాగుకు నీరు ఇవ్వలేమని చెప్పడం బాధ్యతారాహిత్యమేనని మండిపడ్డారు. కర్ణాటకలో హెచ్చెల్సీ ఎగువన ఆరుతడి పంటలకు 90 రోజులపాటు నీరందించే అవకాశం ఉన్నప్పుడు.. దిగువ ప్రాంతంలోని జిల్లా రైతులకు నీరు ఎందుకు అందించరని ప్రశ్నించారు. తుంగభద్రలో ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా అదనంగా నీటిని వినియోగించుకునే అవకాశాలు ఉంటే పరిశీలించి, హెచ్చెల్సీ చివరి ఆయకట్టు రైతులకు కూడా న్యాయం చేయాలని కోరారు. పంట వేయలేకపోయినా, వేసిన పంట ఎండిపోయినా అది రైతు తప్పు కాదని.. నీటిని సకాలంలో అందించాల్సిన వ్యవస్థదే వైఫల్యమని అన్నారు. నీటిని విడుదల చేయడం సాధ్యం కాకపోతే, పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకోబోయే ప్రత్యామ్నాయ చర్యలేవో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఆనంద్‌కు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, నాయకులు నార్పల సత్యనారాయణరెడ్డి, బొమ్మన శ్రీరామ్‌రెడ్డి, వంశీ గోకులరెడ్డి, బోగాతి ప్రతాపరెడ్డి, సరిబాల ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు, ఎల్లారెడ్డి, పరంధామరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, అంకె ముసలన్న, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మంజునాథ్, విష్ణు నారాయణ, నాగేశ్వరరావు, పద్మావతి, బోనాల హరికృష్ణ, ఓబిరెడ్డి, కాటమయ్య, శ్రీనివాసులురెడ్డి, ఆంజనేయులు, నాగలింగారెడ్డి, పుల్లారెడ్డి, కొండ్రెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పట్నం ఫణీంద్ర, నాగభూషణ, రామాంజనేయులు, నాగలింగారెడ్డి, పురుషోత్తం, మల్లికార్జున, ముత్యాల శ్రీనివాస్, బయపరెడ్డి, వెంకటరామిరెడ్డి, నారాయణరెడ్డి, శేఖర్, రమణారెడ్డి, భీమేశ్వర్‌రెడ్డి, బాలరాజు, శివరామిరెడ్డి, ప్రభుదాస్, రాజా, శేషానందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


