డి.హీరేహాళ్
(బొమ్మనహాళ్): ఆలయంపై కలశం ఏర్పాటు చిచ్చు రేపింది. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో నలుగురికి గాయాలయ్యాయి.. డి.హీరేహాళ్ మండలం పులకర్తిలో జంబన్న తాత గుడి వెనుక ఉన్న మడివాల మాచిదేవ ఆలయ విషయంలో రజకులు, కురుబల మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఆలయ హక్కులు, నిర్వహణ తదితర అంశాలపై ఇరువర్గాలు రాయదుర్గం కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్ధానం పరిధిలో ఉంది. ఈ క్రమంలో సోమవారం రజక వర్గానికి చెందిన వారు ఆలయంపై కలశం ఏర్పాటు చేశారు. కోర్టులో వివాదం నడుస్తున్న సమయంలో కలశం ఎలా ఏర్పాటు చేస్తారంటూ కురుబ వర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కలశాన్ని తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని చివరకు పరస్పరం దాడులకు దారితీసింది. సమాచారం అందుకున్న రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, డి.హీరేహాళ్ ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి సిబ్బందితో వెంటనే గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘర్షణలో గాయపడిన రజకవర్గానికి చెందిన ఎర్రిస్వామి, హేమంతరాజు, కురుబ వర్గానికి చెందిన లోకేష్, మంజునాథ్‌ను రాయదుర్గం, బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.


