● కలెక్టర్‌కు సమస్య విన్నవించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
రాప్తాడు రూరల్: అనధికారిక కోతలతో వ్యవసాయానికి విద్యుత్ సక్రమంగా అందడం లేదని, బోర్లు పనిచేయక పంటలు నిలువునా ఎండిపోతున్నాయని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వాపోయారు. సోమవారం అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు మండలాలకు చెందిన పలువురు రైతులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ కరెంటు సమస్యలపై రైతులు సబ్‌స్టేషన్లకు వెళ్లి ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయానికి నిర్దేశించిన సమయంలో విద్యుత్ సరఫరా చేయకుండా కోతలు విధిస్తున్నారన్నారు. ఇప్పటికే ఎల్–నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉన్న భూగర్భ జలాలతో పంటలను కాపాడుకుందామంటే కరెంటు కోతలు వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 2–3 గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని, 300 ఓల్టేజీ ఉండాల్సిన చోట 150–200 మాత్రమే ఉంటోందని తెలిపారు. ఎల్–నినో ప్రభావం ఉంటుందని ముందే పేరూరు డ్యాంకు నీళ్లు నింపాలని కోరినా ఎమ్మెల్యే పరిటాల సునీత, అధికారులు పట్టించుకోలేదన్నారు. హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేయొద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. గతేడాది 7 నెలల పాటు హంద్రీ–నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు 5.5 టీఎంసీల నీరు ఇస్తే.. కేవలం 2.5 టీఎంసీలు మాత్రమే చెరువులకు చేరాయని, మిగిలిన 3 టీఎంసీలు లాసెస్ అయ్యాయని తెలిపారు. ఆ నీటిని ఇక్కడికి ఇస్తే పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న చెరువులన్నీ నిండేవన్నారు. ఇప్పటికై నా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తాగు–సాగునీరు, విద్యుత్ సమస్యలపై దీర్ఘకాళిక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ను కోరారు.


