ఏడీసీసీబీకి టోకరా | - | Sakshi
Sakshi News home page

ఏడీసీసీబీకి టోకరా

Sep 8 2026 12:23 AM | Updated on Sep 8 2026 12:23 AM

నకిలీ బంగారంతో రూ.కోట్ల రుణాలు?

చిలమత్తూరు: అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఏడీసీసీ)కే టోకరా వేశారు. ఆ బ్యాంకు హిందూపురం శాఖలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఏకంగా రూ.8 కోట్ల దాకా రుణాలు పొందినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. బ్యాంకు అధికారుల ప్రమేయంతోనే ఈ స్కాం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల తనిఖీల్లో ఈ ఘరానా మోసం బయట పడ్డట్టుగా తెలుస్తోంది. పదుల సంఖ్యలో గోల్డ్‌లోన్‌ ఖాతాలను తెరిచి నకిలీ బంగారంతో సుమారు రూ.8 కోట్ల వరకూ రుణాలు పొందారనే చర్చ సాగుతోంది. ఆ బ్యాంకులో అంతపెద్ద మొత్తంలో రుణాల మంజూరుకు అనుమతి లేదని అధికార వర్గాలు చెబుతుండగా, ఇంత పెద్ద స్కాం ఎలా జరిగిందనే దానిపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు తనిఖీలు చేసే సమయంలో బంగారం నాణ్యతలో తేడాలొచ్చినట్టుగా సమాచారం. అధికారులకు అనుమానం వచ్చి గోల్డ్‌ లోన్‌ కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని తనిఖీ చేయగా... ‘నకిలీ’ గుట్టు రట్టయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అధికారులు రహస్యంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకు ఉన్నతాధికారులు మాత్రం ఈ గోల్డ్‌ స్కాం అంశాన్ని ధ్రువీకరించడం లేదు.

త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు

అనంతపురం న్యూటౌన్‌: త్వరలో గడువు ముగియనున్న మండల ప్రజా పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా నోటిఫికేషన్‌ (నం.515) జారీ చేశారు. మండల ప్రజా పరిషత్‌ల ఐదేళ్ల పదవీ కాలం ఈ నెల 23తోనూ, జిల్లా పరిషత్‌ల గడువు ఈ నెల 24తోనూ ముగియనుందని, త్వరలోనే మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలకు ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాలను మండల ప్రాదేశిక నియోజక వర్గాల వారీగా ఆయా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, జిల్లా పరిషత్‌ ఫొటో ఓటర్ల జాబితాలను జెడ్పీటీసీల వారీగా సీఈఓలు తయారు చేస్తారు. ప్రజల పరిశీలన నిమిత్తం ఈ నెల 11న ఎంపీపీ, జెడ్పీ కార్యాలయాల్లో ప్రచురించాలి. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు సమన్వయంతో పర్యవేక్షించి, ఎస్‌ఈసీ ఆదేశాలను అమలుచేయాలని ఆ నోటిఫికేషన్‌లో స్పష్టంచేశారు.

విద్యార్థులకు బాలల

బీమా అమలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలల బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. బాలల బీమా కింద ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25వేల ఆర్థికసాయం అందజేస్తారు. ప్రమాదంలో తీవ్ర వైకల్యానికి గురైన విద్యార్థులకు రూ.10 వేలు చెల్లిస్తారు. ప్రతి విద్యార్థి నుంచి ప్రీమియం కింద రూ.5 చొప్పున ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వసూలు చేసి సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి అందజేయాలని సూచించారు. పాఠశాలల వారీగా విద్యార్థుల జాబితాతో పాటు అసలు రశీదును అక్టోబర్‌ 31లోగా సమగ్ర శిక్ష అనంతపురం కార్యాలయంలో అందజేయాలన్నారు.

తాగునీటి సమస్య తలెత్తకూడదు

అనంతపురం అర్బన్‌: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ సోమవారం కలెక్టరేట్‌లో మినీ కాన్ఫరెన్స్‌ హాలులో అధికారులతో సమీక్షించారు. ఎల్‌–నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు. నీటి సమస్య తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, ఎంపీడీఓలు, సంక్షేమ వసతి గృహాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉన్నట్లు తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాబ్‌కార్డులున్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని ఆదేశించారు. ఈ–పంట నమోదు వందశాతం జరగాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ సాలురెడ్డి, ఉద్యానశాఖ ఏడీ ఉమాదేవి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ శైలజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement