దొంగల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

దొంగల హల్‌చల్‌

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

రాయదుర్గంటౌన్‌: రాయదుర్గం పట్టణంలో వరుస చోరీలతో ప్రజలు, చిరు వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి పట్టణంలో మూడు చోరీలు జరిగాయి. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో అనంతపురం రహదారిలోని కోర్టు ఎదురుగా పక్కపక్కనే ఉన్న రెండు ఆటోమొబైల్‌ దుకాణాల్లో కొంత నగదుతోపాటు వస్తువులను దొంగలించారు. పైకప్పు షెడ్డు రేకులను కత్తిరించి లోపలకు ప్రవేశించిన దొంగలు క్యాష్‌ కౌంటర్లలోని కొంత చిల్లర నగదు, ఆటోమొబైల్‌ వస్తువులను దొంగిలించారు. హనిఫ్‌కు చెందిన ఆటోమొబైల్‌ షాపులో రూ.1,500 నగదుతోపాటు వస్తువులు, అలాగే పక్కనే గల యశ్వంత్‌కు చెందిన వెంకటేశ్వర ఆటోమొబైల్‌ షాపులో రూ.4 వేల నగదు, వస్తువులను దొంగిలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపుల్లోని సీసీ కెమెరా డివైజ్‌లను కూడా ఎత్తికెళ్లినట్లు తెలిపారు. అలాగే భంభంస్వామి దర్గా వద్ద నివాసం ఉంటున్న మొహిద్‌ అనే యువకుడు పెంచుకుంటున్న రూ.1.20 లక్షల విలువైన నాలుగు పొట్టేళ్లను ఎత్తుకెళ్లినట్లు బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

గార్లదిన్నె: మండల పరిధిలోని కల్లూరులో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన హాజివలి కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కుమారుడు, కోడలు బంధువుల ఊరికి వవెళ్లగా, హాజి వలి ఒక్కడే ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి, కూరగాయల కోసం అనంతపురం మార్కెట్‌కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగుల గొట్టి లోపలకి చొరబడ్డారు. బీరువా తాళం పగులగొట్టిన అనంతరం 66 తులాల వెండి, 5 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఉదయం ఇంటికి వచ్చిన హాజీవలి తాళం పగులగొట్టి ఉండడం చూసి హతాశుడయ్యాడు. బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి ఘొల్లుమన్నాడు. పోలీసులు క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌస్‌ మహమ్మద్‌ బాషా తెలిపారు.

కొంగుకు రాళ్లు కట్టి.. చైను చోరీ

బెంగళూరులో ఇద్దరు అనంతవాసుల అరెస్టు

దొడ్డబళ్లాపురం(బెంగళూరు):పోలీసులమంటూ మహిళను ఏమార్చి తాళిబొట్టు చైను కాజేసిన ఇద్దరు దొంగలను బెంగళూరు నెలమంగల టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురానికి చెందిన సయ్యద్‌, హుసేన్‌ బాషాలు జూలై 8న బెంగళూరు సుభాష్‌ నగర నివాసి శైలజ స్థానికంగా వాకింగ్‌ చేస్తుండగా ఆమె వద్దకు వెళ్లారు. తాము క్రైం బ్రాంచ్‌ పోలీసులమని, ఇక్కడ ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయని, గస్తీ తిరుగుతున్నామని ఆమెను నమ్మించారు. శైలజ మెడలో తాళిబొట్టు చైను చూసి చాలా విలువైనదిలా ఉంది, ఇలా వేసుకుని తిరగకండి అని చెప్పి చైను విప్పించి పేపర్‌లో చుట్టి ఆమె కొంగుకు ముడి వేసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లి కొంగు ముడి విప్పి చూసిన ఆమెకు చైనుకు బదులు రాళ్లు కనిపించాయి. దీంతో ఆమె నెలమంగల టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అప్పటి నుంచి గాలించి నిందితులను అరెస్టు చేశారు.

భూముల రీసర్వే

పకడ్బందీగా చేపట్టండి

జేసీ విష్ణు చరణ్‌

బెళుగుప్ప: భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ పేర్కొన్నారు. బుధవారం బెళుగుప్ప రెవెన్యూ పధిదిలోని 124, 125 సర్వే నంబర్లలో రైతులు రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరుల సమక్షంలో సాగుతున్న రీసర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రీసర్వేలో ఎలాంటి తప్పులకు తావివ్వకూడదన్నారు. త్వరితగతిన రీసర్వే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూయస్‌కుమార్‌, ఆర్‌డీఓ వసంతబాబు, తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, రీసర్వే ఏడీ కనక ప్రసాద్‌, ఏఓఎస్‌ అంజలి, మండల రీసర్వే డీటీ గురుబ్రహ్మ, వీఆర్‌ఓలు ప్రదీప్‌, ఎర్రిస్వామి, సర్వేయర్‌లు వినోద్‌, శ్రీదర్‌, విమల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement