విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

తాడిపత్రి రూరల్‌: విద్యుత్‌ షాక్‌తో కార్మికుడు మృతి చెందిన ఘటన పట్టణ సమీపంలోని యల్లనూరు రోడ్డు రైల్వే గేటు వద్ద జరిగింది. అప్‌గ్రెడ్‌ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం ముర్షిదాబాద్‌ జిల్లా నర్షిపూర్‌ ప్రాంతానికి చెందిన మసూద్‌రాణా(25) యల్లనూరు రోడ్డు రైల్వే గేటు వద్ద జరుగుతున్న రైల్వే బ్రిడ్జి పనుల వద్ద కూలీగా పనిచేసేవాడు. బుధవారం వెల్డింగ్‌, సెంట్రింగ్‌ పనులు చేస్తున్న సమయంలో చేతిలోని ఫోకస్‌ లైట్‌కు ఉన్న జాయింట్‌ తెగి విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. సహచర కూలీలు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మసూద్‌రాణా మృతి చెందాడని డాక్టర్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

హోంగార్డుపై దాడి

గుత్తి: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో మంగళవారం రాత్రి హోంగార్డు శ్రీనివాసులుపై తిలక్‌ రెడ్డి అనే వ్యక్తి దాడి చేశాడు. హోంగార్డు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేష్‌ బుధవారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. హోంగార్డు శ్రీనివాసులు పీసీ రవీందర్‌ రెడ్డితో కలిసి బస్టాండ్‌ సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన తిలక్‌ రెడ్డి తన స్నేహితునితో కలిసి బైక్‌లో రాంగ్‌ రూట్‌లో వచ్చాడు. హోంగార్డు శ్రీనివాసులు బైక్‌ను ఆపగా.. నా బైక్‌నే ఆపుతావా? అంటూ తిలక్‌ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయాడు. హోంగార్డుపై దాడికి పాల్పడ్డాడు. పీసీ రవీందర్‌రెడ్డి సర్దిజెప్పినా వినలేదు. హోంగార్డు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హోంగార్డు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడటంతో బాధితుడి ఫిర్యాదు మేరకు తిలక్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

అప్పుల బాధతో వ్యక్తి బలవన్మరణం

సోమందేపల్లి(పరిగి): సోమందేపల్లి మండలంలోని కేతగానిచెరువు గ్రామానికి చెందిన నాగరాజు (42) అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేతగానిచెరువు గ్రామానికి చెందిన నాగరాజు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. ఇతనికి భార్య మంజులతో పాటూ ఇద్దరు సంతానం ఉన్నారు. నాగరాజుకు కొంతకాలంగా అప్పుల బాధలు ఎక్కువైనట్లు స్థానికులు తెలిపారు. దీంతో తరచూ మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన గత మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు చరణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement